US Man Bank Robbery: వీడు ఘరానా దొంగ.. సినీ ఫక్కీలో ప్లాన్.. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి మరీ బ్యాంకు రాబరీ
బ్యాంకులో దోపిడీకి వెళ్లేందుకు ఉబర్ కారు బుక్ చేసుకున్నాడు. బ్యాంకులో పని ఉందని, డ్రైవర్ హంటింగ్‌టన్ బ్యాంకు బయట వెయిట్ చేయమని చెప్పి అతను లోపలికి వెళ్లాడు. దీంతో డ్రైవర్ బ్యాంకు బయటే ఉన్నాడు.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు.. ఈ సామెతను ఆదర్శంగా తీసుకుని చేసేది చిన్న దొంగతనం అయినా ఎవరికీ తెలియకుండా పట్టుబడకుండా ఉండే విధంగా రకరకాల కోణాల్లో ఆలోచించించి కష్టపడి ప్లాన్ చేసి దొంగతనానికి వెళ్తారు చాలామంది. అవును దొంగతనం చేయాలనుకునేవాళ్లు పోలీసులకు ఏ చిన్న క్లూ కూడా దొరక్కుండా ప్లాన్ చేసుకొని దొంగతనం చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఘరానా దొంగ సినీ ఫక్కీలో దోపిడీకి ప్లాన్ చేశాడు. చివరకు ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు. ఈ దొంగ ఓ బ్యాంకులో దోపిడీకి ఎలా వెళ్లాడో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అమెరికాలోని మిచిగాన్ సౌత్‌ఫీల్డ్‌లో నవంబర్ 16న ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. చోరీకి పాల్పడిన వ్యక్తి పేరు జెసన్ క్రిస్ట్‌మస్. ఇతను బ్యాంకులో దోపిడీకి వెళ్లేందుకు ఉబర్ కారు బుక్ చేసుకున్నాడు. బ్యాంకులో పని ఉందని, డ్రైవర్ హంటింగ్‌టన్ బ్యాంకు బయట వెయిట్ చేయమని చెప్పి అతను లోపలికి వెళ్లాడు. దీంతో డ్రైవర్ బ్యాంకు బయటే ఉన్నాడు. అనంతరం తుపాకీతో బ్యాంకు లోపలికి వెళ్లిన జేసన్.. అధికారులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత హుందాగా తిరిగి కారు వద్దకు వచ్చాడు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో అతడు జేసన్‌ను తిరిగి తన ఫ్లాట్‌లో డ్రాప్ చేశాడు.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఉబర్ కార్ నెంబర్ ప్లేట్ ఆధారంగా డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఆ దోపిడీ గురించి తనకేమీ తెలియదని చెప్పాడు. డ్రైవర్‌కు దోపిడీతో సంబంధం లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఉబర్ డేటా ఆధారంగా జేసన్ అడ్రస్ పట్టుకున్నారు. నేరుగా అతని ఫ్లాట్‌కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. జేసన్ దుస్తులపై రక్తం కనిపించడంతో ఎవరైనా షూట్ చేశారా? అని పోలీసులు అడిగారు. అలాంటిదేం లేదని, అది రంగు అని.. అదికూడా బ్యాంకు నుంచే తీసుకువచ్చినట్లు నిందితుడు చెప్పాడు. ప్యాసెంజర్ గురించి వివరాలు తెలుసుకోకుండా రైడ్‌కి వెళ్లరాదని ఉబర్ డ్రైవర్‌కు సూచించిన పోలీసులు, మరోసారి ఎవరైనా అనుమానంగా కన్పిస్తే వెంటనే సమాచారం అందించాలని చెప్పారు. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బంధువులు, కుటుంబసభ్యులకు ఖరీదైన బహుమతులు, వస్తువులు ఇవ్వడానికే జేసన్ క్రిస్టియన్ ఈ దోపిడీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..