Guinness World Record: 21 వారాలకే జన్మించిన శిశువు… వెరీ ప్రిమెచ్యూర్ బేబీగా గిన్నిస్ రికార్డ్…
సాధారణంగా మహిళ గర్భదారణ తర్వాత తొమ్మిదో నెలలో లేదా పదో నెలలో శిశువులు జన్మిస్తుంటారు. మరికొంత మంది ఏడో నెలలోనే పుడుతుంటారు. వారిని నెలతక్కువ పిల్లాడు లేదా పిల్ల అని అంటుంటారు. వైద్య భాషలో చెప్పాలంటే ప్రి మెచ్యూర్ బేబీలుగా పిలుస్తుంటారు. సాధారణంగా...

సాధారణంగా మహిళ గర్భదారణ తర్వాత తొమ్మిదో నెలలో లేదా పదో నెలలో శిశువులు జన్మిస్తుంటారు. మరికొంత మంది ఏడో నెలలోనే పుడుతుంటారు. వారిని నెలతక్కువ పిల్లాడు లేదా పిల్ల అని అంటుంటారు. వైద్య భాషలో చెప్పాలంటే ప్రి మెచ్యూర్ బేబీలుగా పిలుస్తుంటారు. సాధారణంగా 32 నుంచి 37 వారాల మధ్య పుడితే ప్రిమెచ్యూర్ అంటారు. అదే 28 నుంచి 32 వారాల మధ్య అయితే వెరీ ప్రిమెచ్యూర్‌గా పిలుస్తారు. ఇవేమి కాకుండా అంతకు మించి.. 28 వారాలకు ముందుగానే ప్రసవించిన శిశువుని ఎక్స్‌ట్రీమ్ ప్రిమెమెచ్యూర్ బేబి అంటుంటారు. ఇలాంటి శిశువులు చాల రకాల ఆరోగ్య సమస్యలతో జన్మిస్తారు. అటువంటి శిశువులను కాపాడటం వైద్యులకు అత్యంత సవాలుగా ఉంటుంది. దాదాపు బతకడం కూడా కష్టమే అంటారు వైద్యులు. కానీ, ఇక్కడో శిశువు మాత్రం 21 వారాలకే జన్మించి బతికి బట్టకట్టి ఏకంగా గిన్నిస్ రికార్డుకెక్కి సెలబ్రిటీ అయ్యాడు.
అమెరికాలోని అయోవా నగరంలో ఈ అరుదైన రికార్డ్ నమోదైంది. జూలై 05, 2024లో మోలీ, రాండాల్ కీన్ అనే దంపతులకు నాష్ కీన్ అనే మగ శిశువు జన్మించాడు. ప్రసవ తేదీకి ముందుగా 133 రోజులు అంటే సుమారు 19 వారాల ముందు జన్మించాడు. తల్లిదండ్రులు సైతం షాక్ అయ్యారు. తమ బిడ్డ బతుకుతాడా లేదా అన్న ఆశ నిరాశల మధ్య ఆ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లాయి.
ఆ చిన్నారి పుట్టినప్పడు కేవల 10 ఔన్సులు బరువు మాత్రమే ఉన్నాడు. చెప్పాలంటే ద్రాక్షపండంతా పరిమాణం. నాష్ పొటాటోగా పిలిచే ఆ శిశువుకి అయోవా చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి ఆరు నెలలుగా అత్యంత జాగ్రత్తగా వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఎట్టకేలకు ఆ బిడ్డ బతికిబట్టకట్టడమే గాక ఈ ఏడాది తొలిపుట్టిన రోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆరు నెలలుగా ఆ శిశువు ఆస్పత్రిలో మానిటర్లు, వైర్ల మధ్యే గడపాల్సి వచ్చింది.
ఈ చిన్నారి నాష్ 20 వారాల ప్రినేటల్ చెకప్ అనంతరం డెలివరీ చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడిందని నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది తల్లి మోలీ. అలా మొత్తం ఆరు నెలల చికిత్స అనంతరం 2025 జనవరి ప్రారంభంలో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటూ సాధారణ చిన్నారిలా మారిపోయాడు. అయితే ఆ శిశువుకి ప్రత్యేక వైద్య సహాయం తప్పనిసరి. అతను ఇంకా ఆక్సిజన్ పైపుల ద్వారానే తీసుకుంటున్నాడు. స్వల్ప వినికిడి సమస్య ఉంది. ప్రతి నెల ప్రత్యేక వైద్య డేకేర్‌కి వెళ్లి చికిత్స తీసుకుంటుంటాడు.
కాగా, 2020లో అలబామాలో 21 వారాల్లో జన్మించి ఒక చిన్నారి గిన్నిస్ రికార్డులకి ఎక్కగా..దాన్ని కేవలం ఒక్క రోజు తేడాతో ఈ చిన్నారి నాష్ బ్రేక్ చేసి రికార్డునే తిరగరాశాడు.
