Indo America Relations: భారత్‌తో ఆర్ధిక సంబంధాలపై బిడెన్ ప్రభుత్వ ఆసక్తి.. త్వరలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పర్యటన!

|

Oct 30, 2021 | 2:00 PM

భారతదేశంతో ఆర్ధిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం బిడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Indo America Relations: భారత్‌తో ఆర్ధిక సంబంధాలపై  బిడెన్ ప్రభుత్వ ఆసక్తి.. త్వరలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పర్యటన!
America
Follow us on

Indo America Relations: భారతదేశంతో ఆర్ధిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం బిడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆసియా దేశాలతో ముఖ్యంగా భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం అమెరికాలో బిడెన్ అధికార పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి తమ ప్రాధాన్యతాంశంగా పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ దిశలో మరో ముందడుగు వేస్తున్నారు. ఇందుకోసం యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కేథరీన్ తాయ్ వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని ఆమె కార్యాలయం ప్రకటించింది. బిడెన్ అడ్మినిస్ట్రేషన్ లో తాయ్ అతి ముఖ్యమైన వాణిజ్య అధికారిగా ఉన్నారు. ఆర్ధికాంశాల పరిశీలన.. ఇతర దేశాలతో ఆర్ధిక సంబంధాలపై తాయ్ నివేదికలు అమెరికా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయి.
పర్యటన ఇలా..

బిడెన్ అడ్మినిస్ట్రేషన్ టాప్ ట్రేడ్ అధికారి అయిన తాయ్ నవంబర్ 22 న దక్షిణ కొరియా నుండి న్యూఢిల్లీకి చేరుకుంటారు. నవంబర్ 15న టోక్యో నుంచి ఆమె ఆసియా యాత్రను ప్రారంభిస్తారని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) శుక్రవారం తెలిపింది. తాయ్ నవంబర్ 24న వాషింగ్టన్ DCకి తిరిగి వెళ్తారని వెల్లడించారు.

“యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కేథరీన్ తాయ్, డిప్యూటీ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ సారా బియాంచి టోక్యో, సియోల్, న్యూ ఢిల్లీకి వెళ్లి ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల అమెరికా యొక్క శాశ్వత నిబద్ధత గురించి చర్చించడానికి ప్రభుత్వ అధికారులు, వాటాదారులతో సమావేశమవుతారు. కీలక మిత్రులు, భాగస్వాములతో సంబంధాలపై ఆమె చర్చిస్తారు” అని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తన ప్రకటనలో పేర్కొంది.

మెరుగుపడుతున్న సంబంధాలు:

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన మొదలైన తరువాత భారత్ తో చెలిమి విషయంలో అమెరికా మరింత ఆసక్తి చూపిస్తూ వస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ తాలిబన్ల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం.. మరోవైపు చైనా దూకుడు పెరుగుతుండటంతో అమెరికా వ్యూహాత్మకంగా భారత్ తో తనా స్నేహాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అంతర్జాతీయంగా అన్ని అంశాలలోనూ భారత్ అభిప్రాయాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ వస్తోంది అమెరికా.

మరోవైపు భారత్ కూడా ఆచి తూచి అడుగులు వేస్తోంది. తాలిబన్లపై వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్త పరచకుండానే.. వారితో స్నేహానికి అర్రులు చాచుతున్న చైనా, పాకిస్తాన్ కు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ భారత వ్యతిరేక చర్యలను అంతర్జాతీయంగా బయటపెట్టిన భారత్.. చైనా అనుసరిస్తున్న విధానాలనూ బహిర్గతం చేయడంలో విజయవంతం అయింది.

ఇవి కూడా చదవండి: Solar Flare: సూర్యునిలో పేలుడు.. సౌర తుపానుగా భూమిపైకి.. కమ్యూనికేషన్లపై కనిపించనున్న ఎఫెక్ట్!

Microsoft: ఆపిల్‌ను వెనక్కి నెట్టేసిన మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ!

By Polls 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఈరోజే..