Davos 2026: దావోస్‌లో ట్రంప్ టెన్షన్.. సదస్సుకు 3వేల మంది ప్రపంచ నేతలు.. చర్చంతా వాటిపైనే..
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మొదలైంది. ఈసారి సదస్సు మామూలుగా లేదు.. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో వాతావరణం వేడెక్కింది. 130 దేశాల నుంచి ఏకంగా 3 వేల మంది లీడర్లు హాజరయ్యారు. అసలు ఈసారి దావోస్‌లో ఏం జరుగుతోంది? భారత్ ఫోకస్ ఏంటి? ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

ఈసారి దావోస్ సదస్సుకు రికార్డు స్థాయిలో జనం వచ్చారు. 130 దేశాల నుంచి దాదాపు 3,000 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో 400 మంది టాప్ పొలిటికల్ లీడర్లు ఉంటే, ఏకంగా 65 మంది దేశాధినేతలు ఉన్నారు. చరిత్రలో ఇంతమంది ఒకేసారి రావడం ఇదే తొలిసారి. ప్రపంచంలోని టాప్ కంపెనీల నుంచి 850 మంది CEOలు, 100 మందికి పైగా యూనికార్న్ బాస్‌లు అక్కడే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం దావోస్ రానున్నారు. ఆయన రాకకోసం అందరూ ఆసక్తిగా, అంతకంటే ఎక్కువ భయంగా ఎదురుచూస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే యూరప్, చైనాలపై పన్నుల పెంపు గురించి వార్నింగ్ ఇచ్చారు. గ్రీన్‌లాండ్ ఇష్యూతో యూరప్‌తో గొడవ పడుతున్నారు. దీంతో సదస్సులో ట్రేడ్ వార్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్‌కు చెక్ పెట్టేందుకు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా, చైనా వైస్ ప్రీమియర్ హీ లైఫెంగ్ సిద్ధంగా ఉన్నారు. వీళ్లిద్దరూ మంగళవారమే మాట్లాడబోతున్నారు.
ఉక్రెయిన్ యుద్ధమే అజెండా
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా దావోస్‌లో ఉన్నారు. ఆయన నేరుగా ట్రంప్‌ను కలిసే ఛాన్స్ ఉంది. రష్యాతో యుద్ధం, ఆయుధాల సాయంపైనే వీరి చర్చ సాగనుంది. దావోస్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ముప్పు జియో ఎకనామిక్ వార్. అంటే ఆర్థిక ఆధిపత్యం కోసం దేశాల మధ్య గొడవలే 2026లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మరోవైపు ఇన్నాళ్లూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు లీడర్లంతా “AI వల్ల లాభం ఏంటి? బిజినెస్‌కి ఎంత ఉపయోగం?” అనే లెక్కలు వేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల, గూగుల్, ఎన్విడియా అధినేతలు అక్కడే ఉన్నారు.
భారత్ వ్యూహం – పెట్టుబడులే లక్ష్యం
భారత్ నుంచి ఈసారి స్ట్రాంగ్ టీమ్ వెళ్లింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తయారీ రంగం, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు ఆకర్షించడమే భారత్ టార్గెట్. ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నా, భారత్ మాత్రం పెట్టుబడులకు సేఫ్ ప్లేస్ అని మనవాళ్లు స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. మొత్తానికి ఈసారి దావోస్ చర్చల కంటే ఘర్షణల వేదికగా మారేలా కనిపిస్తోంది. ట్రంప్ స్పీచ్ తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
