UN HUMAN RIGHTS: రంగంలోకి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య.. ఇజ్రాయెల్ వ్యవహారంపై మే 27న స్పెషల్ మీట్

| Edited By: Anil kumar poka

May 20, 2021 | 7:31 PM

మిడిల్ ఈస్ట్ దేశాలను ఆందోళనలోకి నెట్టిన ఇజ్రాయెల్, పాలస్తీనా సాయుధ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతూనే వుంది. కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ససేమిరా అన్న నేపథ్యంలో ఇరు వర్గాల పోరు మరింత తీవ్రమైంది.

UN HUMAN RIGHTS: రంగంలోకి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య.. ఇజ్రాయెల్ వ్యవహారంపై మే 27న స్పెషల్ మీట్
Follow us on

UN HUMAN RIGHTS EXTRAORDINARY MEET ON ISRAEL: మిడిల్ ఈస్ట్ దేశాలను ఆందోళనలోకి నెట్టిన ఇజ్రాయెల్, పాలస్తీనా సాయుధ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతూనే వుంది. కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ససేమిరా అన్న నేపథ్యంలో ఇరు వర్గాల పోరు మరింత తీవ్రమైంది. ఈక్రమంలో ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సమాఖ్య ఈ పరిస్థితిపై దృష్టి సారించింది. మే 27వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రకటించింది. అయితే సమాఖ్యలో మొత్తం 47 సభ్య దేశాలుండగా.. వీటిలో కనీసం మూడో వంతు అంగీకరిస్తేనే మే 27వ తేదీన ప్రత్యేక సమావేశం జరుగే అవకాశం వుంది. తూర్పు జెరూసలేంతోపాటు ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు సమాఖ్య ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. పాలస్తీనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యుఎన్ఓ మానవ హక్కుల సమాఖ్య పాకిస్తాన్ ముందుగా ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ ఇస్లామిక్ కోపరేషన్ సమన్వయకర్తగా ప్రస్తుతం వ్యవహరిస్తోంది. మూడో వంతు సభ్య దేశాలు అంగీకరిస్తే మే 27వ తేదీన జరగబోయే సమావేశం 30వ అసాధారణ సమావేశంగా చరిత్రలో మిగిలబోతోంది. గత పదిహేనేళ్ళలో ఇలాంటి అసాధారణ సమావేశం జరగడం ఇదే తొలిసారి అవుతుంది. గాజాపై మే 19, 20 తేదీల్లో జరిగిన ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మానవ హక్కుల కౌన్సిల్ అసాధారణ సమావేశం ప్రతిపాదనకు తెరలేపింది. గత 10 రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా సాయుధ బలగాల కొనసాగుతున్న యుద్దంలో ఇప్పటి వరకు 230 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. అందులో 65 మంది చిన్నారులున్నట్లు కథనాలు వస్తున్నాయి.

అయితే.. ఈ గణాంకాలను ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు కొట్టిపారేశారు. ఉగ్రవాదులను తప్ప పౌరులు లక్ష్యంగా తాము దాడులు జరపడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు హమాస్ సహా పాలస్తాన ఉగ్రవాద సంస్థలు తమ దేశంపై ఏకంగా 4,070 రాకెట్ బాంబులను ప్రయోగించారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. ఈ రాకెట్ దాడులలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారని తెలిపింది. వీరిలో ఓ చిన్నారి, ఓ భారతీయ పౌరుడు, ఇద్దరు థాయ్ లాండ్ పౌరులున్నారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది.

మరోవైపు పాలస్తీనా హమాస్‌ మిలటరీ మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు ఉధృతం చేసింది. మే 19నఉదయం గాజా స్ట్రిప్‌పై బాంబు వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను విరమించాలంటూ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌ మిలిటరీ ఖాతరు చేయడం లేదు. హమాస్‌ రాకెట్‌ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెబుతోంది.

శత్రువులను బలహీనపర్చడానికి వైమానిక దాడులను ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. తాజా దాడుల్లో సౌత్ గాజా టౌన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 40 మంది నివసించే భవనం నేలమట్టమయ్యింది. ఖాన్‌ యూనిస్, రఫా పట్టణాల్లో 40 సొరంగాలను ధ్వంసం చేయడానికి 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రయోగించింది. 58 వేల మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. గత 10 రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య సాగుతున్న హింసాకాండకు ఇకనైనా స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు సూచించారు. ఇరువురు నేతలు మే 19న ఫోన్‌ ద్వారా మాట్లాడుకున్నారు. ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలని బైడెన్‌ నొక్కిచెప్పారు. ఆ తర్వాత నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తన లక్ష్యం నెరవేరేదాకా దాడులు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్‌ చర్యలపై పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో )
మధ్యదరా స‌ముద్రంలో ఘోరం….!! ప‌డ‌వ మునిగి 57 మంది మృతి… ( వీడియో )