Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ప్రపంచానికి ముప్పు తప్పదా?

డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడైన తర్వాత, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. గత రెండు రోజులుగా శాంతి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయన్ అణు విద్యుత్ ప్లాంట్‌‌పై రష్యా దాడి చేసింది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌తో పాటు మొత్తం యూరప్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ప్రపంచానికి ముప్పు తప్పదా?
Chernobyl Nuclear Plant Ukraine
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 14, 2025 | 3:29 PM

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌లోని నాల్గవ విద్యుత్ యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్‌ల సహాయంతో దాడి చేసింది. చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యన్ డ్రోన్ల దాడి, ప్రపంచ అణు భద్రతను ప్రమాదంలో పడేశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఈ దాడికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రష్యా చేసిన ఈ దాడిని ప్రపంచ భద్రతకు పెద్ద ముప్పుగా నిపుణులు భావిస్తున్నారు. చెర్నోబిల్‌లో నిర్మించిన ఈ ప్రత్యేక యూనిట్‌ను ఉక్రెయిన్, యూరప్, అమెరికా ఇతర దేశాల సహాయంతో, రేడియేషన్ ప్రమాదాలను నివారించే లక్ష్యంతో నిర్మించారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. అయితే, రేడియేషన్ స్థాయి సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని IAEA తెలిపింది. గత గురువారం(ఫిబ్రవరి 13) రాత్రి చెర్నోబిల్‌లోని ధ్వంసమైన అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. అయితే, ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తరువాత లీక్ స్థాయి సాధారణ పరిమితుల్లోనే ఉందని తెలిపింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. రష్యా అంతర్జాతీయ నియమాలను విస్మరించి అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుందని, ఇది మొత్తం ప్రపంచానికి తీవ్రమైన ముప్పు అని ఆయన ఆరోపించారు. ఇటువంటి దాడులు ప్రపంచ భద్రతను దెబ్బతీస్తాయని, తక్షణ ప్రతిస్పందన అవసరమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

“ధ్వంసమైన నాల్గవ పవర్ యూనిట్ వద్ద రేడియేషన్ నుండి ప్రపంచాన్ని రక్షించే షెల్టర్‌పై అధిక పేలుడు వార్‌హెడ్‌తో కూడిన రష్యన్ దాడి డ్రోన్ దాడి చేసింది” అని జెలెన్‌స్కీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు. యూనిట్‌ను కప్పి ఉంచిన కాంక్రీట్ షెల్టర్ దెబ్బతిన్నదని, మంటలను ఆర్పివేశామని జెలెన్‌స్కీ చెప్పారు. దాడి తర్వాత రేడియేషన్ స్థాయి పెరగలేదని, దానిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన అన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం, ఆశ్రయం విస్తృతంగా దెబ్బతింది. రాత్రి ఆకాశంలోకి భారీ పొగ మేఘం ఎగసిపడింది.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) కూడా X లో స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు కొద్దిసేపటి ముందు, చెర్నోబిల్ ప్లాంట్‌లోని తమ బృందం “పూర్వపు చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌లోని రియాక్టర్ 4 అవశేషాలను రక్షించే న్యూ సేఫ్ కన్ఫైన్‌మెంట్ నుండి పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, దీని వలన మంటలు చెలరేగాయని” తెలిపింది. “విద్యుత్ ప్లాంట్ పైకప్పుపై UAV (డ్రోన్) దాడి చేసిందని వారికి సమాచారం అందింది” అని IAEA తెలిపింది.

1986లో ఉక్రెయిన్, బెలారస్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చెర్నోబిల్ యూనిట్ 4 ప్లాంట్‌లో కూడా భారీ పేలుడు సంభవించింది దీని వలన సోవియట్ యూనియన్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో విస్తృతమైన రేడియోధార్మికత వ్యాపించింది. ఆ తరువాత దానిని కాంక్రీట్, స్టీల్ సార్కోఫాగస్‌లో సీలు చేశారు. సార్కోఫాగస్ అనే ఫ్లాంట్ అంతర్జాతీయ అవసరాల కోసం నిర్మించడానికి దశాబ్దాలు పట్టింది. ఇది చివరకు 2017 లో పూర్తయింది. 35,000 టన్నుల బరువు ఉంటుంది.

గురువారం రాత్రి రష్యా ఉక్రెయిన్‌పై 133 డ్రోన్‌లను ప్రయోగించిందని, వాటిలో 73 డ్రోన్‌లను కూల్చివేసిందని, 58 తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. ఈ సంఖ్యలు డ్రోన్ దాడులకు సంబంధించిన ఇటీవలి సగటులకు దాదాపు సమానంగా ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తున్న 11 ప్రాంతాలలో డ్రోన్లను కూల్చివేశారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత, శాంతి చర్చలు ముమ్మరం అయ్యాయి. గత ఒకటి లేదా రెండు రోజుల్లో శాంతి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే రష్యా చేసిన ఈ దాడి యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ దాడి తర్వాత, మొత్తం ఉక్రెయిన్‌తో పాటు మొత్తం యూరప్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.

అణు రియాక్టర్ నుండి లీక్ అయితే యూరప్ మొత్తం సంక్షోభంలో పడే అవకాశం ఉందని భయపడుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం సంభవించవచ్చంటున్నారు నిపుణులు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..