AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Earthquake: 18 గంటల్లో 155 సార్లు కంపించిన భూమి.. ఎగసి పడుతున్న అలలు.. సునామీ హెచ్చరికలు జారీ.. 13 మంది మృతి..

జపాన్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత తీవ్ర సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చశారు. సముద్రంలో 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. దాదాపు లక్ష మందిని తీర ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశించారు. ఇషికావా, నీగాటా, ఫుకుయ్, టొయామా, గిఫు ప్రిఫెక్చర్లలో అత్యధిక నష్టం సంభవించింది.

Japan Earthquake: 18 గంటల్లో 155 సార్లు కంపించిన భూమి.. ఎగసి పడుతున్న అలలు.. సునామీ హెచ్చరికలు జారీ.. 13 మంది మృతి..
Japan Earth Quack
Surya Kala
|

Updated on: Jan 02, 2024 | 9:15 AM

Share

ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ సంతోషంగా గడుపుతోన్న వేళ.. ఆసియా దేశమైన జపాన్ లో ప్రకృతి కన్నెర్ర జేసింది. కొత్త సంవత్సరం 2024 లో అడుగు పెడుతూనే జపాన్‌ వరస భూకంపాలను ఎదుర్కొంటుంది. ఒకదాని తర్వాత ఒకటి బలమైన భూకంపాలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 18 గంటల్లో 155 సార్లు భూమి కంపించింది. కేవలం రెండు గంటల్లోనే 40 ప్రకంపనలువచ్చాయి. జపాన్‌లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని అదే దేశ వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 13 మంది మరణించినట్లు ప్రకటించారు. అంతేకాదు మరోవైపు దాదాపు లక్ష మందిని తీర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు.

ప్రాణాంతకమైన అలలు ఇంకా ఎగసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని .. తాము చెప్పే వరకూ ఇళ్లకు తిరిగి రావద్దని చెప్పారు. 7.6 తీవ్రతతో సంభవించిన అతిపెద్ద భూకంపంతో దేశంలో ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో భారీ విధ్వసం ఏర్పడింది. అనేక భవనాలు కూలిపోయాయి. జపాన్ వాతావరణ సంస్థ సోమవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత ఇషికావా తీరంతో పాటు పరిసర ప్రాంతాలలో జపాన్ సముద్రంలో డజనుకు పైగా బలమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించింది.

భూకంపం కారణంగా కనీసం ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయని.. ప్రజలు లోపల చిక్కుకున్నారని ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని వాజిమా నగరంలో మంటలు చెలరేగాయని, 30,000 ఇళ్లకు పైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని  చెప్పారు.

ఇవి కూడా చదవండి

సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచనలు వాతావరణ సంస్థ మొదట్లో ఇషికావాకు భారీ సునామీ హెచ్చరికను జారీ చేసి.. హోన్షు పశ్చిమ తీరానికి అలాగే దేశంలోని ఉత్తరాన ఉన్న ప్రధాన ద్వీపమైన హక్కైడోకు దిగువ స్థాయి సునామీ హెచ్చరికను జారీ చేసింది. తీర ప్రాంతాల నుండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం చాలా ముఖ్యం అని హయాషి నొక్కిచెప్పారు. ప్రతి నిమిషం విలువైనదని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు.

కొన్ని గంటల తర్వాత హెచ్చరిక సాధారణ సునామీగా మార్చబడింది.. అంటే సముద్రంలోని అలలు  ఇప్పటికీ 3 మీటర్లు (10 అడుగులు) వరకు ఎగసి పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అదే ప్రాంతంలో ప్రకంపనలు కూడా సంభవించవచ్చని ఏజెన్సీ తెలిపింది. జపనీస్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK TV సముద్ర నీటి ప్రవాహం 5 మీటర్లు (16.5 అడుగులు) ముందుకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ ప్రాంతంలో  వరస ప్రకంపనలు ఏర్పడడంతో సునామీ హెచ్చరికలను ప్రసారం చేసింది. అంతేకాదు తీర ప్రాంతంలోని  ప్రజలను స్టేడియంలకు తరలించారు. అక్కడ వారు కొన్ని రోజులు ఉండవలసి ఉంటుంది.

సహాయక చర్యల్లో నిమగ్నమైన జపాన్ సైన్యం

జపాన్ సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు హయాషి తెలిపారు. సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో కొన్ని  సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ బుల్లెట్ రైళ్లు ఆ ప్రాంతంలో నిలిచిపోయాయి. NHK ప్రకారం హైవే రహదారులు కూడా మూసివేశారు. అంతేకాదు భూకంప ధాటికి నీటి పైపులు పగిలిపోయాయి. కొన్ని ప్రాంతంలో కొన్ని సెల్‌ఫోన్ సేవలు కూడా పనిచేయడం లేదు. వాతావరణ సంస్థ జాతీయ టెలివిజన్ వార్తా సమావేశంలో వచ్చే వారం ముఖ్యంగా రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత పెద్ద  భూకంపాలు తాకవచ్చని పేర్కొంది.

డజనుకు పైగా భూకంపాలు

ఏజెన్సీ ప్రకారం ఈ ప్రాంతంలో డజనుకు పైగా బలమైన భూకంపాలు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని ఒక కన్వీనియన్స్ స్టోర్‌లోని ఉద్యోగి తకాషి వాకబయాషి మాట్లాడుతూ.. ఇంట్లోని అల్మారాల్లో వున్న కొన్ని వస్తువులు పడిపోయాయని వెల్లడించారు. భూకంపం, సునామీని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఇప్పుడుభారీ సంఖ్యలో వాటర్ బాటిల్స్, రైస్ బాల్స్ ,  బ్రెడ్‌ను నిల్వ  చేసుకోవడంపై దృష్టి పెట్టారు.

స్టోర్స్ కు ప్రజలు క్యూ కట్టారు. సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఉత్తర కొరియాతో పాటు రష్యాలోని కొన్ని ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపాలు , సునామీలపై సమాచారాన్ని సేకరించి, భద్రత చర్యలు చేపట్టడానికి..  నివాసితులకు త్వరగా సూచనలు  అందజేయడానికి జపాన్ ప్రభుత్వం అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తెలిపారు.

సహాయం చేస్తున్న అమెరికా

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. జపాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని.. జపాన్ ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2011లో జపాన్‌లో ఏర్పడిన భారీ భూకంపం..  సునామీ అణు ప్లాంట్ వైఫల్యానికి కారణమైంది. అయితే అప్పటి నుంచి ఆ దేశంలో తీవ్ర భూకంపం, హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రభావిత ప్రాంతంలోని అణు కర్మాగారాలు సోమవారం ఎలాంటి ప్రభావానికి  గురికాలేదని ప్రభుత్వ ప్రతినిధి హయాషి విలేకరులకు తెలిపారు. ఈ ప్రాంతంలోని మానిటరింగ్ పోస్టుల వద్ద రేడియేషన్ స్థాయిలు పెరగలేదని అణు నియంత్రకారులు తెలిపారు.

మరిన్ని అంతజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.