Donald Trump: పెద్దన్నకు పెద్ద కష్టమే! మిడిల్ డ్రాప్ అవుతారా? వీటోతో కొడతారా..?
దోస్త్ దోస్తే.. పేకాట పేకాటే. ఈ సూక్ష్మాన్ని ఇన్నిరోజులకు గానీని గ్రహించినట్టు లేరు ట్రంప్ మేస్టారు. తన దాకా వస్తే గాని తెలిసిరాదంటారే అదే ఇది..! నీ ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేసుకో అని జిగ్రీదోస్తు ఇజ్రాయెల్‌ని రెచ్చగొట్టడమే కాదు, ఏటా 4 బిలియన్ డాలర్లు ఫండింగ్ కూడా ఇచ్చి దానకర్ణుడు అనిపించుకున్నారు. కట్‌చేస్తే, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పైసల్లేవు పో.. అని చేతులూపేశారు. రాబోయే పదేళ్లు కూడా నో పైసా.. ఓన్లీ దోస్తానా అనేశారు. మన డాలర్లు పక్కోళ్లకు పంచుతున్నారు, యుద్ధోన్మాదిగా మారుతున్నారు అని డెమొక్రాట్లు అదేపనిగా ఎండగట్టబట్టి, ఆవిధంగా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఎడ్వాంటేజ్ పొందబట్టి, ఫలితం తనకు వ్యతిరేకంగా వస్తుండంతో.. ట్రంప్ గారు ఇలా మారుమనసు పొందారనుకోవచ్చు. కానీ, మీరు మారిపోయారు సార్ అని ప్రెసిడెంట్‌గారిని సర్టిఫై చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే, మధ్యంతర ఎన్నికల తర్వాత మోనార్క్ 2.0గా మేకోవర్ అవుతున్నారు అధ్యక్షులవారు. ఓటమిని ఒప్పుకోకపోగా, రాబోయే రోజుల్లో డెమొక్రాట్లకు పెద్ద సినిమానే చూపిస్తానని కళ్లెగరేస్తున్నారు. మిడ్‌టర్మ్ ఫలితం తర్వాత ప్రెసిడెంటుగారి తొండాట ఎలా ఉండబోతోంది..?

రచ్చగెలవడం మీదే ఫోకస్ పెట్టి ఇంట గెలవాలన్న సోయే లేకుండా పోయినట్టుంది అమెరికా అధ్యక్షులవారికి. యుద్ధాల మీద యుద్ధాలు చేసి, కొన్ని యుద్ధాలను ఆపినట్టు కలరింగ్ ఇచ్చిఇచ్చీ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం లాబీయింగ్ ఆడిఆడి అలసిసొలసిపోయిన ట్రంప్‌సారుకి ఇంట్లో కూడా ఈగల మోత మొదలైంది. కందిరీగల్లా కరిచేస్తున్నారు డెమొక్రాట్లు. అవును, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ప్రెసిడెంట్‌గారికి పిచ్చెక్కించేస్తున్నాయి. రిపబ్లికన్ల వరుస ఓటములు ఆయన్ను దిక్కుతోచని స్థితిలోకి తోసేస్తున్నాయి. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, చేతిలో రాయిని ఎటువైపు విసురుతాడో తెలీక ప్రపంచం అంతటా అదోరకం పరేషాన్లు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అమెరికాలోనే కాదు.. ప్రపంచం మొత్తానికీ హాట్ ఫేవరిట్‌గా మారాయి. ప్రెసిడెంట్ పాలనకు రిఫరెండం లాంటిది గనుక అంతోటి ప్రతిష్టాత్మకంగా మారింది అమెరికాలో మిడ్‌టర్మ్ ఫలితం. ట్రంప్ మీద భయంతోనో భక్తితోనో అమెరికా మధ్యంతర ఎన్నికలకు ఫండింగ్ ఇవ్వడానికి ఈసారి క్యూలోకొచ్చి నిలబడ్డాయి అక్కడి కార్పొరేట్ కంపెనీలు. ఇలా విరాళాలు ఇచ్చినవాళ్లలో మహా బిలియనీర్ ఎలాన్ మస్క్‌దే ఫస్ట్ ప్లేస్. బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థుల కోసం 500 మిలియన్ డాలర్ల దాకా కుమ్మరించారు. టెక్సాస్ సెనేట్ రేసులో నిలబడ్డ తన జిగ్రీ దోస్త్ కెన్ ప్యాక్స్‌టన్ మీదైతే 100 మిలియన్ డాలర్లు, మన రూపాయల్లో అయితే వెయ్యి కోట్లు పోశారు. కానీ, మస్క్ మామే అంత సీరియస్‌గా తీసుకున్న టెక్సాస్‌ను కూడా ఎగరేసుకుపోయారు డెమొక్రాట్లు. 38 ఏళ్లుగా రిపబ్లికన్ల అడ్డాగా వున్న టెక్సాస్‌లో జెండా పాతేశారు...
