AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫోన్‌కు పోటీగా ఫోన్ లాంచ్​ చేస్తున్న ChatGPT.. చిప్‌సెట్​, ఫీచర్ల గురించి తెలిస్తే మతిపోతుంది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో కొత్త మార్పు రాబోతుందా? ఇప్పటివరకు ChatGPTతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న OpenAI ఇప్పుడు సొంత స్మార్ట్‌ఫోన్ తయారీపై దృష్టి పెట్టినట్లు టెక్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 2027 ప్రథమార్థంలో ఈ ఫోన్ తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. ఐఫోన్ల తయారీ, అసెంబ్లింగ్‌లో భాగస్వామిగా ఉన్న Foxconn అనుబంధ సంస్థ FIH Mobile ఈ ఫోన్ తయారీ బాధ్యతలు చేపట్టవచ్చని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐఫోన్‌కు పోటీగా ఫోన్ లాంచ్​ చేస్తున్న ChatGPT.. చిప్‌సెట్​, ఫీచర్ల గురించి తెలిస్తే మతిపోతుంది
Openai Smartphone .jpg
Nikhil
|

Updated on: Nov 23, 2026 | 6:10 AM

Share

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ప్రతి పనికీ ప్రత్యేక యాప్ అవసరం అవుతోంది. మెసేజ్‌లు పంపడం, టికెట్లు బుక్ చేయడం, మీటింగ్స్ ఏర్పాటు చేయడం, సమాచారం వెతకడం వంటి పనుల కోసం వేర్వేరు యాప్‌లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ OpenAI రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతున్న ఫోన్‌లో AI Agent ప్రధాన పాత్ర పోషించనుంది. యూజర్ ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని వివిధ పనులను స్వయంగా పూర్తి చేసే విధంగా దీన్ని రూపొందించవచ్చని అంచనా. ఇది నిజమైతే స్మార్ట్‌ఫోన్ వినియోగ విధానంలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

యాప్స్‌కు బదులుగా AI Agent..

ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన AI Agent ఆధారిత వ్యవస్థ ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి. మెసేజ్ పంపడం, మీటింగ్ షెడ్యూల్ చేయడం, ఆన్‌లైన్‌లో సమాచారం వెతకడం వంటి పనులను యూజర్ ఆదేశాల ఆధారంగా AI అసిస్టెంట్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ChatGPT యాపిల్, గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల పరిధిలో పనిచేస్తోంది. సొంత స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తే నోటిఫికేషన్లు, సెట్టింగ్స్, ఇతర సిస్టమ్ ఫీచర్లతో AIని మరింత లోతుగా అనుసంధానించే అవకాశం OpenAIకి లభిస్తుంది. దీంతో యూజర్లకు వేగవంతమైన, సమగ్ర AI అనుభవాన్ని అందించవచ్చని అంచనా.

కెమెరా ప్రత్యేకతలు

ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కువో వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో కస్టమైజ్డ్ MediaTek Dimensity 9600 చిప్‌సెట్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో డ్యూయల్ NPU ఉండటం వల్ల కొన్ని AI పనులను నేరుగా ఫోన్‌లోనే నిర్వహించే అవకాశం ఉంది. అంటే ప్రతిసారీ ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా కొన్ని పనులను వేగంగా పూర్తి చేయవచ్చు. కెమెరా విభాగంలో మెరుగైన HDR సపోర్ట్‌తో పాటు పరిసరాలను గుర్తించగల అప్‌గ్రేడెడ్ ఇమేజ్ ప్రాసెసర్ అందించనున్నట్లు సమాచారం.

మరోవైపు గత ఏడాది మాజీ Apple డిజైనర్ జానీ ఐవ్‌కు చెందిన io సంస్థను OpenAI సుమారు రూ.54,600 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్న స్క్రీన్ లేని చిన్న AI గ్యాడ్జెట్, ఈ స్మార్ట్‌ఫోన్ రెండూ వేర్వేరు డివైజ్‌లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రత్యేక గ్యాడ్జెట్ కూడా 2027 ఫిబ్రవరి తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే OpenAI స్మార్ట్‌ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, తుది లాంచ్ తేదీపై ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.

Follow Us