X500 Series ధర గురించి లీకిచ్చిన Vivo.. ఫీచర్లతోనే ఫిదా చేస్తున్న టెక్ దిగ్గజం.. స్పెషాలిటీస్ ఇవే
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో నుంచి త్వరలో X500 సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. ఈ సిరీస్‌లో Vivo X500, Vivo X500 Pro, Vivo X500 Pro Max మోడళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వీటితో పాటు Vivo Watch GT 2 స్మార్ట్‌వాచ్, Zeiss Telephoto Converter కిట్‌ను కూడా పరిచయం చేయనున్నారు. లాంచ్‌కు ముందే ఈ డివైజ్‌ల ధరలు, ర్యామ్, స్టోరేజ్ వివరాలు ఆన్లైన్లో లీక్ కావడంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.

మంచి కెమెరా, అధిక స్టోరేజ్, వేగవంతమైన ప్రాసెసర్‌తో కూడిన ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తున్నవారికి Vivo Watch GT 2 సిరీస్ కీలక ఎంపికగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా Pro Max మోడల్లో 200MP కెమెరాలు, ప్రత్యేక ఫోటోగ్రఫీ కిట్ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఫోన్ల ధరలు లక్ష రూపాయలకు పైగా ఉండొచ్చని లీక్ వివరాలు సూచిస్తున్నాయి. కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు వీటిని అంచనా ధరలుగానే పరిగణించాలి.
ధరలు ఎంతంటే..
టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం Vivo X500 ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. దీని ధర రూ.1,19,999గా ఉండొచ్చని సమాచారం. ఇక Vivo X500 Pro కూడా 12GB RAM, 256GB స్టోరేజ్తోనే రానున్నట్లు లీక్ చెబుతోంది. దీని ధర రూ.1,49,999గా అంచనా వేస్తున్నారు. ఈ రెండు మోడళ్లలో ప్రస్తుతం 512GB స్టోరేజ్ వేరియంట్లు వచ్చే అవకాశం లేదని సమాచారం.
సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్ Vivo X500 Pro Max. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,59,999గా ఉండొచ్చు. 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,79,999గా అంచనా. దీనికి అదనంగా Master Photography Set తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కిట్ కోసం మరో రూ.50,000 చెల్లించాల్సి రావచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నట్లు సమాచారం.
200MP కెమెరాలు
కెమెరాల విషయానికి వస్తే Vivo X500 Pro, Pro Max మోడళ్లలో Zeiss ట్యూనింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 200MP Zeiss APO టెలిఫోటో కెమెరా, అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నట్లు లీక్ వెల్లడించింది. Pro Max మోడల్లో రెండు 200MP కెమెరాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫోన్లలో MediaTek Dimensity 9600 సిరీస్ ఆక్టా-కోర్ చిప్సెట్ అందించనున్నట్లు సమాచారం.
కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం Vivo X500 సిరీస్, Vivo Watch GT 2 భారత లాంచ్ సెప్టెంబర్ 26న జరగనుంది. ఫోన్లు Vivo ఆన్లైన్ స్టోర్‌తో పాటు Amazon, Flipkartలో విక్రయానికి రానున్నాయి. Pro, Pro Max మోడళ్లు Apex Orange, Eternal Black రంగుల్లో, సాధారణ X500 Ember Red, Titanium Black రంగుల్లో లభించనున్నట్లు సమాచారం. Vivo Watch GT 2 ధర రూ.14,999గా ఉండొచ్చని లీక్ చెబుతోంది. అయితే ఫోన్ల తుది ధరలు, స్టోరేజ్ వేరియంట్లు, ఇతర వివరాలపై కంపెనీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
