జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఈ నెల15, 16 తేదీల్లో జరిగే సమ్మిట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ప్రధాని మోడీ ఇవాళ ( సోమవారం ) బాలీకి బయలుదేరనున్నారు. దాదాపు 20 భేటీల్లో ప్రధాని పాల్గొననున్నట్లు సమాచారం. జీ – 20 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మోడీ.. బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆరోగ్యం వంటి కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ తో పాటు ప్రధాని మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలూ నిర్వహించనున్నట్లు సమాచారం.
జీ-20 సదస్సులో ప్రధాని పర్యటన నిమిత్తం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండోనేషియా వేదికగా జరగనున్న 17వ జీ-20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఈ నెల 14 నుంచి 16 వరకు బాలిలో పర్యటించనున్నారు. బాలి సమ్మిట్ సందర్భంగా ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి ప్రపంచ ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై నాయకులతో విస్తృత చర్చలు చేయనున్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా ప్రధాని పాల్గొనే అనేక ఇతర దేశాల నాయకులతో సమావేశమవుతారు. వారితో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తారు. నవంబర్ 15 న బాలిలో ప్రసంగిస్తారు.
డిసెంబర్ 1 న భారతదేశం అధికారికంగా జీ – 20 ప్రెసిడెన్సీని స్వీకరిస్తుంది. వచ్చే ఏడాది జీ-20 సమ్మిట్‌కు సభ్యులు, ఇతర ఆహ్వానితులకు కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారు. సమ్మిట్‌లో చర్చల సమయంలో భారతదేశం సాధించిన విజయాలను, ప్రపంచ సవాళ్లను సమష్టిగా పరిష్కరించడంలో నిబద్ధత గురించి ప్రస్తావిస్తారు. వసుధైవ కుటుంబం అనే థీమ్‌పై ద్వారా సమానమైన వృద్ధి, అందరికీ భవిష్యత్తును పంచుకునే సందేశాన్ని వివరిస్తారు.
– ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన
ఈ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్, జర్మన్ ఛాన్స్‌లర్ ఓలఫ్ షోల్జ్‌తోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని సమాచారం. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..