అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వారికి బిగ్ షాక్.. అక్కడ హెచ్-1బీ వీసాలకు బ్రేక్
అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న విదేశీ ఐటీ నిపుణులకు టెక్సాస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. “టెక్సాస్ పౌరులకే తొలి ప్రాధాన్యం” అనే నినాదంతో గవర్నర్ కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హెచ్-1బీ వీసాలపై మరోసారి చర్చ మొదలైంది.

గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా H-1B visaపై సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వీసాల జారీపై కఠిన ఆంక్షలు పెట్టారు. ఇది చాలదు అన్నట్లు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నగరాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇకపై కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో నడిచే సంస్థలు విదేశీయుల కంటే స్థానిక అమెరికన్ కే ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన చట్టాలను రూపొందించడానికి ఈ గడువును వినియోగించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏదైనా ప్రభుత్వ సంస్థ, యూనివర్సిటీ అనివార్య కారణాల వల్ల విదేశీ నిపుణులను నియమించుకోవాల్సి వస్తే, టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుంచి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది.
అలాగే గత ఏడాది కాలంలో ఎన్ని హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేశారో.. ప్రస్తుతం ఎంతమంది విదేశీయులు పనిచేస్తున్నారో పూర్తి వివరాలతో కూడిన నివేదికను మార్చి 27, 2026 నాటికి సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రైవేట్ కంపెనీలపై దీని ప్రభావం ఉండదని అధికారులు వివరించారు. కాలిఫోర్నియా తర్వాత అమెరికాలో అత్యధిక హెచ్-1బీ హోల్డర్లు ఉన్న రాష్ట్రం టెక్సాస్.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగం చేసేందుకు 40వేల మందికి పైగా హెచ్-1బీ వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1200 మంది పనిచేస్తున్నారు. అయితే హెచ్-1బీ వీసా వ్యవస్థపై టెక్సాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
