తనకి ఆశ్రయం ఇచ్చి ఆకలి తీర్చడానికి పాముకి పాలు పోస్తే.. తిరిగి ఆ వ్యక్తిని కరిచింది అని పెద్దలు చెప్పిన విషయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది దాయాది దేశంలోని వరుస ఉగ్రదాడులు. తాజాగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడ్డారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో మంగళవారం ఉగ్రవాదులు పోలీసులను టార్గెట్ చేశారు. పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 23 మంది పోలీసులు మరణించారు. ఈ ఉగ్రదాడిలో 16 మంది గాయపడినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
సమాచారం ప్రకారం దక్షిణ వజీరిస్తాన్ గిరిజన జిల్లా సరిహద్దులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న దర్బన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు మొదట పేలుడు పదార్ధాలున్న వాహనంతో పోలీస్ స్టేషన్ భవనంలోకి వచ్చి ఢీకొట్టారు. అనంతరం మోర్టార్ బాంబులతో దాడి చేశారు.
స్థానిక పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి చేసిన తరువాత భద్రతా దళాలు, దాడికి మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం ఆరుగురు భద్రతా సిబ్బంది సహా 23 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు హతమార్చినట్లు ఖైబర్ పఖ్తున్ఖ్వా పోలీసులు తెలిపారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. మొత్తం ఎంత మంది ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రదాడి గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు ప్రారంభించారు.
తీవ్రవాదుల దాడి తర్వాత సమీపంలోని పోలీసు బృందాలను వెంటనే సంఘటనా స్థలానికి పంపారు. ఉగ్ర దాడి కారణంగా జిల్లా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించగా.. భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..