
Afghanistan Taliban: తాలిబన్ల రాజ్యం ఆఫ్ఘనిస్తాన్‌లో ఆటవిక పాలన మొదలైంది. ఆటవిక శిక్షలతో తాలిబన్లు నరరూప కాలకేయులు లాగా ప్రవర్తిస్తున్నారు. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, చేతులు, కాళ్లు నరికివేతలు, క్షౌర శాలలపై నియంత్రణ లాంటి చట్టాల వరకూ వెళ్లింది. కఠిన షరియా చట్టాల అమలు చేస్తూ తాలిబన్లు నరరూప హంతకుల్లా మారుతున్నారు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమందిని బహిరంగంగా ఉరితీసిన తాలిబన్లు.. క్రేన్‌తో నడిరోడ్డుపై వేలాడదీసి క్రూరత్వాన్ని మరోసారి చూపించారు. అంతేకుండా చిన్నారులను సైతం బహిరంగంగా చంపుతూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా.. తాలిబన్లు ఓ బాలుడిని బహిరంగంగా దారుణంగా చంపారు. ఆ బాలుడి తండ్రి తాలిబన్ల వ్యతిరేక దళంలో పనిచేస్తున్నాడనే అనుమానంతో తాలిబాన్లు చిన్నారిని ఉరివేసి చంపారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ తఖర్ ప్రావిన్స్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ దేశంలోని పరిస్థితులను కవర్ చేసే ఒక స్వతంత్ర మీడియా సంస్థ పంజ్‌షీర్ అబ్జర్వర్ షేర్ చేసింది. బాలుడి మృతదేహం పక్కన మరో ముగ్గురు చిన్నారులు ఏడుస్తూ కూర్చొని ఉన్నట్లు మీడియా తెలిపింది. తాలిబన్లు మరింత క్రూరత్వంగా తమ మార్క్ పాలనను చూపిస్తున్నారంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. చిన్నారిని ఉరి తీయడం హక్కులను హరించడమేనని పేర్కొంది.
కాగా.. ఆగష్టు 15న దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. ప్రతీకార దాడులు జరగవని హామీ ఇచ్చారు. అయితే.. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో.. వ్యతిరక దళాలు, తాలిబన్ల మధ్య భీకర పోరాటం జరిగింది. ఈ ఘర్షణల్లో చాలామందిని తాలిబన్లు చంపారు. తాలిబన్లకు వ్యతిరేక గళం వినించిన వారిపై ప్రతీకార హత్యలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై వెళ్లే వారిని ఆపి.. మొబైల్స్ చెక్ చేస్తున్నారని.. వారి వ్యతిరేకమని తేలితే.. చంపుతున్నారంటూ ప్రజలు మీడియాకు వెల్లడించారు. తాలిబన్ల ఆటవిక రాజ్యంలో అణచివేతలు, హత్యలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Also Read: