సుడాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. దాదాపు 72 రెండు గంటల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఆ దేశ సైనిక, పారామిలటరీ బలగాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ సోమవారం వెల్లడించారు. గత రెండు రోజులుగా చర్చలు జరిపిన అనంతంరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు కానుంది. సుడాన్ రాజధాని అయిన ఖార్టూమ్ నుంచి అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిని అమెరికా సైనికులు తరలించిన అనంతరం ఈ ప్రకటన వచ్చింది.
అయితే ఈ కాల్పుల విమరణ అనేది మానవతా కారిడర్లు ఏర్పాటు చేయడానికి.. ప్రజలు అవసరమైన వనరుల్ని, వైద్యాన్ని సమకూర్చుకోవడానికి.. అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ట్విట్టర్ లో తెలిపింది. అయితే శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించారు. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. సుడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వల్లే ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీశాయన్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 400 మందికి పైగా చనిపోగా.. 3,500 లకు పైగా గాయాలపాలయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..