రష్యాను మరోసారి భూ ప్రకంపనలు వణికించాయి. రష్యాలోని తూర్పు తీరంలో సోమవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే సునామీ సంభవించలేదని, తక్షణ ప్రాణనష్టం జరగలేదని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం రష్యా పసిఫిక్ తీరంలో పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చట్‌స్కీకి దక్షిణంగా 44 కిలో మీటర్ల (27 మైళ్ళు) దూరం, 100 కిలో మీటర్ల లోతులో సంభవించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
మాస్కోకు తూర్పున 6,800 కిలో మీటర్ల దూరంలో ఉన్న కమ్‌చట్కా ద్వీపకల్పం నుండి మీడియా పోస్ట్ చేసిన ఫుటేజీ, భూకంపం కారణంగా కూలిన తర్వాత సూపర్ మార్కెట్‌లు, వివిధ భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు కనిపించాయి. అయితే, ప్రాణనష్టం మాత్రం సంభవించలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది భవనాలను పరిశీలిస్తున్నాయని అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.
An #earthquake of magnitude 6.9 occurred in #Kamchatka. There were no reports of casualties or damage. pic.twitter.com/TdBXDPV0Wx
— NEXTA (@nexta_tv) April 3, 2023
భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వే కంచట్కా బ్రాంచ్ తెలిపింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తొలుత భూకంప తీవ్రత 6.6గా ఉందని తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది.