Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో క్షణక్షణం పరిణామాలు మారిపోతున్నాయి. ప్రజాగ్రహంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. దీంతో గొటబయ సోదరులు మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్లరాదంటూ శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. మహింద, బసిల్ ఈ నెల 28 వరకు దేశం విడిచి వెళ్లడంపై నిషేధం విధించింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ శ్రీలంక, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు, శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు రణిల్ విక్రమ్ సింఘే. ఆయనతో శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా.. గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో చాలా రోజులుగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో గొటబయ రెండు రోజుల క్రితం దేశం విడిచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. తన అసంబద్ధ నిర్ణయాలతో దేశాన్ని దివాలా తీయించారని గొటబయ ప్రజాగ్రహానికి గురయ్యారు. గొటబయ రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.
స్పీకర్ నిర్ణయం మేరకు రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడిని పార్లమెంట్ ఎన్నుకునే వరకు అధ్యక్షుడిగా విక్రమ సింఘే కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..