చైనాలో ఓ గొర్రెల మంద వింతగా ప్రవర్తిస్తోంది. రెండు వారాలుగా వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నాయి. పగలూ రాత్రి అలసట లేకుండా తిరుగుతున్న వాటి తీరు ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ గొర్రెలన్నీ ఒకే విధంగా ప్రవర్తించడం మిస్టరీగా మారింది. చైనా ఇన్నర్ మంగోలియాకు చెందిన మయో అనే వ్యక్తి వందల సంఖ్యలో గొర్రెలను పెంచుతున్నాడు. అందులో కొన్ని గొర్రెలు నవంబర్ తొలి వారం నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఒక మందలోని గొర్రెలు అవి ఉన్నచోటే వృత్తాకారంలో తిరగడం ప్రారంభించాయి. తొలుత కొన్ని గొర్రెలు ఇలా నడవడం మొదలుపెట్టగా.. వాటికి మరిన్ని తోడయ్యాయి. అలా ఏకంగా 12 రోజులపాటు ఆ మందలోని గొర్రెలన్నీ క్రమం తప్పకుండా గుండ్రంగా తిరుగుతూనే ఉండటం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్న వీడియో ఒకటి.. ఈ నెల మొదట్లో తెగ హల్‌చల్ చేసింది. చైనా అధికారిక మీడియా సంస్థ పీపుల్స్ డెయిలీ కూడా దీనిపై వార్తలను ప్రచారం చేసింది. ఇది చైనా ప్రజలను కలవరానికి గురిచేసింది. అలా తిరగడం అపశకునమని.. మరో ప్రకృతి విపత్తుకు ముందస్తు సంకేతంగా అక్కడి ప్రజలు అనుమానం వ్యక్తంచేశారు. అయితే, ఈ సమయంలో నెటిజన్లు చైనా నుంచి మరో ముప్పు రాబోతోందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం చేశారు.
లిస్టెరియోసిస్ బాక్టీరియా సోకడం వల్ల ఇలా గొర్రెల మంద వింతగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని పశువైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనినే సర్క్లింగ్ వ్యాధి అని కూడా పిలుస్తారు. మెదడులో ఓవైపు దెబ్బతినడంతో అవి వింతగా ప్రవర్తించేందుకు దారితీస్తాయి. ఈ వ్యాధి సోకిన జంతువులు 48 గంటల్లోనే మరణించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
వీడియో చూడండి..
The great sheep mystery! Hundreds of sheep walk in a circle for over 10 days in N China’s Inner Mongolia. The sheep are healthy and the reason for the weird behavior is still a mystery. pic.twitter.com/8Jg7yOPmGK
— People’s Daily, China (@PDChina) November 16, 2022
ఇంకా అవి చాలాకాలంగా దొడ్డికే పరిమితం అయి ఉండొచ్చని.. ఆ కారణంగా బయటకు రాగానే.. అవి తమ పరిధిని దాటి పోకుండా అలాగే ఉండిపోయాయని పేర్కొంటున్నారు. మందలోని కొన్ని గొర్రెలు అలా ప్రవర్తిస్తే.. పోనుపోనూ మిగతావి కూడా వాటిని అనుసరిస్తూ ఉండిపోయాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇతర జంతువుల వేట నుంచి తప్పించుకోవడం, తమ సమూహాన్ని రక్షించుకునే క్రమంలో గొర్రెలు ఇలా తమ ముందున్న వాటిని అనుసరిస్తాయని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..