Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు బాంబింగ్ స్పీడును పెంచాయి. సెవెరో దోనెస్క్, లైసిచాన్‌స్క్ ప్రాంతాల్లో పెద్దఎత్తున దాడులకు దిగాయి. సుమీ, చెర్నివ్ ప్రాంతాల సరిహద్దుల్లో రష్యా సైన్యం స్పీడుగా ముందుకు కదులుతోంది. మరోవైపు దోనెస్క్, లుహాన్‌స్క్ ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమకున్న ప్రాధాన్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ తేల్చిచెప్పారు.
ఇదిలాఉంటే.. రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి కేథరిన్ కొలొన్నా ఉక్రెయిన్‌కు వచ్చారు. బుచా నగరంలో రష్యా సేనలు చేసిన నష్టాన్ని, నరమేధాన్ని చూశారు. ఆ తర్వాత ఆమె రాజధాని కీవ్‌కు వెళ్లి అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఫ్రాన్స్ మంత్రి కొలొన్నా కలుసుకున్నారు. ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా ఈ పర్యటన చేపట్టానని తెలిపారు ఫ్రాన్స్ మంత్రి.
మరోవైపు ఉక్రెయిన్‌కు చెందిన యూరోవిజన్ మ్యూజిక్ ఛాంపియన్లు మాతృభూమి కోసం ట్రోఫీని అమ్ముకున్నారు. మే నెల 11నుంచి 14 వరకు జరిగిన ఈ మ్యూజిక్ కాంటెస్ట్‌లో విజేతలైన ఉక్రెయిన్ టీమ్- తమ ట్రోఫీని వేలంలో అమ్మేశారు. ఇలా అమ్మేసి ఏడుకోట్ల రూపాయలు సంపాదించారు. ఈ సొమ్ముతో తమ దేశ సైన్యం కోసం డ్రోన్లు కొనుగోలు చేయడానికి ఇస్తామని యూరోవిజన్ విజేతలు ప్రకటించారు. ఇక రష్యన్ సేనల దాడిలో సర్వనాశమైన ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మరియుపోల్‌లో సామూహిక సమాధులు కనిపిస్తున్నాయి. ఎంతమంది చనిపోయారన్న ప్రశ్నకు ఈ శ్మశానాలు జవాబు చెబుతున్నాయి.