ఆయుధాలకు బదులుగా ఆహార ధాన్యాలు సరఫరా.. నార్త్ కొరియాతో రష్యా డీల్! అమెరికా రియాక్షన్ ఏమంటే..?
ఉక్రెయిన్‌లోని రష్యా సైన్యానికి, రష్యా కిరాయి సైనికుల వాగ్నర్ గ్రూపుకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తుందని అమెరికా గతంలోనే ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కొరియా నియంత జిమ్ తరఫు ప్రతినిధులు అప్పట్లో ఖండించారు.
ఉక్రెయిన్‌తో ఏడాదికి పైగా యుద్ధం చేస్తోన్న రష్యా.. కొత్త ఆయుధాలను సమకూర్చుకునేందుకు నానాతంటాలు పడుతోంది. ఆయుధాల సాయం కోసం ఇతర మిత్ర దేశాల వైపు చూస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించి రష్యాకు నార్త్ కొరియా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాల్లో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌లోని రష్యా సైన్యానికి, రష్యా కిరాయి సైనికుల వాగ్నర్ గ్రూపుకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తుందని అమెరికా గతంలోనే ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కొరియా నియంత జిమ్ తరఫు ప్రతినిధులు అప్పట్లో ఖండించారు. ఇందులో భాగంగానే ఆయుధాలకు బదులుగా ఆహారం అందించే ఒప్పందం కోసం రష్యా ఒక ప్రతినిధి బృందాన్ని ఉత్తర కొరియాకు పంపుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. దీనికి ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించి తమకు కొత్త సమాచారం అందినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఉత్తర కొరియా – రష్యా మధ్య జరిగే ఎలాంటి ఆయుధ ఒప్పందం అయినా UN భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని కిర్బీ అభ్యంతరం వ్యక్తంచేశారు.
‘ఉత్తర కొరియాకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఉత్తర కొరియా అందజేసే ఆయుధ సామగ్రికి బదులుగా రష్యా ఆ దేశానికి ఆహార సరకులు అందజేస్తోందని మేము అర్థం చేసుకున్నాము’ అని జాన్ కిర్బీ పేర్కొన్నారు. రష్యా ఆయుధ కొనుగోళ్లకు సంబంధించి ఆ రెండు దేశాల మధ్య చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, ప్రతిపాదిత ఒప్పందాన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.
ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. నియంత జిమ్ ఏలుబడిలోని ఆ దేశం.. అణ్వాయుధాల కారణంగా అమెరికా, యూరఫ్ దేశాల నుంచి పలు ఆంక్షలు ఎదుర్కొంటోంది. గత దశాబ్ధకాలంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా ఆ దేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన సరిహద్దు నియంత్రణలు, ప్రపంచ దేశాల ఆంక్షల ప్రభావంతో ఆ దేశంలో ఆకలి కేకలు మరింత తీవ్రతరం కావొచ్చన్న నిపుణులు అంచనావేస్తున్నారు. 2021 కంటే 2022లో ఉత్తర కొరియా ఆహార ఉత్పత్తి మరింత తగ్గినట్లు దక్షిణ కొరియా అధికారులు గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల కోసం చైనా, రష్యా తదితర మిత్ర దేశాల వైపు నార్త్ కొరియా చూస్తోంది.
అటు ఉక్రెయిన్‌పై దాడుల అనంతరం రష్యాకు ఆయుధాల విక్రయంలో పలు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో కొత్త ఆయుధాలను సమకూర్చుకునేందుకు రష్యా కొత్త మార్గాలను వెతుక్కొంటోంది. ఆయుధాల సరఫరా కోసం ముందుకు వస్తున్న నార్త్ కొరియాతో భారీ డీల్ కోసం రష్యా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..