Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆరో రోజూ కొనసాగుతున్న రష్యా దాడులు.. 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి

|

Mar 01, 2022 | 10:49 AM

Russia - Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు ఆరో రోజూ కొనసాగుతూనే ఉన్నాయి. నివాస ప్రాంతాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది.

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆరో రోజూ కొనసాగుతున్న రష్యా దాడులు.. 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి
Russia Ukraine
Follow us on

Russia – Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు ఆరో రోజూ కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్‌టిర్కా‌(Okhtyrka)లోని ఉక్రెయిన్ మిలిటరీ శిబిరంపై రష్యా జరిపిన ఫిరంగి దాడిలో ఆ దేశానికి చెందిన దాదాపు 70 మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. కీవ్, కిర్కివ్ నగరాలకు మధ్యలో ఒక్‌టిర్కా నగరం ఉంది. అటు నివాస ప్రాంతాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో రాజధాని నగరం కీవ్‌తో పాటు ఇతర నగరాల్లో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ? ఏం బాంబు మీద పడుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. రష్యా సేనలు నివాస ప్రాంతాలపై కూడా బాంబుల దాడికి దిగడంతో పిల్లా పాపలతో సహా ఉక్రెయిన్‌ వాసులు దేశం వీడుతున్నారు . ఇప్పటికే ఉక్రెయిన్‌ నుంచి లక్షలాది మంది సరిహద్దు దేశాలకు వలస వెళ్లారు. పోలాండ్‌తో పాటు ఇతర దేశాల్లో తల దాచుకుంటున్నారు. ఉక్రెయిన్‌ బంకర్లలలో ఉన్నవారు కూడా బయటకి వస్తున్నారు.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సోమవారంనాడు బెలారస్ బోర్డర్‌లో జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. దాదాపు 3 గంటల పాటు ఈ రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి తీర్మానం లేకుండానే చర్చలు ముగిశాయి. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని చర్చల్లో ఉక్రెయిన్‌ ప్రధానంగా డిమాండ్‌ చేసింది. క్రిమియా, డాన్‌బాస్‌ నుంచి రష్యా సైన్యం వైదొలగాలని డిమాండ్‌ చేసింది. అయితే రష్యా మాత్రం నాటో దేశాల కూటమిలో ఉక్రెయిన్‌ చేరకూడదని ప్రధానంగా డిమాండ్‌ చేసింది. తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా కోరింది. అయితే ఈ డిమాండ్లపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరోసారి చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. పోలాండ్‌- బెలారస్‌ సరిహద్దులో మరో దఫా చర్చలు జరగనున్నాయి.

అటు శాంతి  చర్చలు జరుగుతున్న సమయంలో కూడా రష్యా సేనలు రెచ్చిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చర్చలు జరుగుతున్న సమయంలో కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వైపు వేగంగా సాగుతున్న దృశ్యాలు శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా కనిపించాయి.

మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు కొనసాగుతోంది. బుకారెస్ట్‌ నుంచి 182 మంది విద్యార్థులతో వచ్చిన విమానం ముంబై చేరుకుంది. మరో రెండు విమానాల్లో కూడా విద్యార్థులను తరలిస్తున్నారు. ఒక విమానంలో 216, మరో విమానంలో 218 మంది విద్యార్థులు వస్తున్నారు.

Also Read..

Smart Mobile: మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

Hyderabad: భాగ్యనగరం శివారులో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..