Russia-Ukraine War: యుద్ధ క్షేత్రంలో పరిస్థితి రోజు రోజుకూ ఊహించని రీతిలో మారిపోతోంది. పుతిన్(Putin) తాను చర్చలకు సిద్ధమంటూనే.. మరోవైపు ‘అణు’ హెచ్చరికలు(Nuclear Missiles) చేస్తూ ప్రపంచదేశాలను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో శాంతి చర్చలు జరిపేందుకు రెండు దేశాలు ముందుకొచ్చాయి. అదే సమయంలో అణ్వాయుధ వినియోగానికి సంసిద్ధంగా ఉండాలంటూ తమ సేనలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ఉక్రెయిన్‌కు కొన్ని దేశాలు ఆయుధాలను అందిస్తూ ఉండడం.. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుండడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘స్విఫ్ట్’ నుంచి రష్యాను బహిష్కరిస్తూ ఇప్పటికే అమెరికా, ఇతర దేశాలు నిర్ణయం తీసుకోవడం, రష్యాలోకి విమానాల రాకపోకల్ని ఈయూ దేశాలు నిషేధించడం పుతిన్ కు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మరో వైపు దీనిపై భారత్ ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. ఉక్రెయిన్ లో జరుగుతున్న మారణకాండలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం ఇంతవరకు స్పష్టతలేదు.
శాంతి చర్చలు జరిపేందుకు బెలారస్‌కు రావాలని ఉక్రెయిన్‌ను ఆహ్వానించిన రష్యా.. దాని కోసం ఆ దేశంలోని గోమెల్ నగరానికి తమ ప్రతినిధి బృందాన్ని కూడా పంపించింది. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం బెలారస్ తమకు ఆమోదయోగ్య ప్రదేశం కాదని అన్నారు. చర్చల కోసం అక్కడికైతే రాబోమని తేల్చి చెప్పారు. తమపై దాడులకు బెలారస్ ను వాడుకుంటూ.. అక్కడికే శాంతి చర్చలకు రావాలనడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా తప్పుపట్టారు. దీనికి బదులుగా.. ఇస్తాంబుల్, బాకు, బుడాపెస్ట్, వార్సా, బ్రటిస్లావా లాంటి ఏదైనా నగరంలో చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. ఎట్టకేలకు చివరికి రెండు వర్గాలు బెలారస్ నే తమ చర్చలకు వేదికగా అంగీకరించారు.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాలను ప్రయోగించడానికి రష్యా సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణమైనా రంగంలో దిగే సన్నద్ధతతో అప్రమత్తంగా ఉండాలని రష్యా అణ్వాయుధ బలగాలకు పుతిన్ ఆదివారం ఆదేశాలిచ్చారు. దీనికి తోడు ఖర్కివ్ నగరంలో గ్యాస్ పైప్ లైన్ ను రష్యా సైన్యం పేల్చివేయటం వల్ల పర్యావరణంపై పెను ప్రభావం కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రష్యా హ్యూహాత్మకంగా ఓడరేవులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. రెండు రోజుల తరువాత ఉక్రెయిన్ సేనలు సైతం ఊహించని రీతిలో రష్యా దళాలను ప్రతిఘటిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధం రష్యా ప్రభుత్వం చేస్తున్న ఉగ్రవాదమని.. తాము శాంతి, స్వేచ్ఛకోసం ప్రయత్నిస్తున్నామని జెలెన్స్కీ వెల్లడించారు. ఇదే సమయంలో అంతర్జాతీయ కోర్టులో రష్యా యుద్ధాన్ని ఆపేలా చూడాలని ఉక్రెయిన్ ప్రధాని కోరారు.
ఇవీ చదవండి..
Youtube: రష్యాపై ఆంక్షలు విధించిన మరో టెక్ దిగ్గజం .. ఈసారి యూట్యూబ్ వంతు..