
బ్రిటన్ ప్రధానిగా తొలిసారిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు భారతీయ సంస్కృతి, సంప్రాదయాలు అంటే ఎంతో గౌరవం, భారతీయ విధానాల గురించి ఎప్పుడూ గొప్పగా చెబుతుంటారు. భారతీయ విధానాలంటే ఎంతో ఇష్టపడే వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో రిషి సునాక్ కు మార్గం సుగమమైంది. ప్రస్తుతం పెన్నీ మోర్డాంట్ మాత్రమే ప్రధాని రేసులో సునాక్ తో పోటీకి నిలిచారు. అయితే, రేసులో నిలవాలంటే కనీసం వంద మంది ఎంపీల మద్దతును ఆమె కూడగట్టాల్సి ఉంటుంది. దానికి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలతో వ్యవధి ముగిసింది. గడువు ముగిసాక ఆమెకు పోటీలో నిలిచేందుకు అవసరమైన ఎంపీల మద్దతు లభించకపోవడంతో రిషి సునాక్ గెలుపు సునాయసమైంది. ఇటీవలే రిషి సునాక్ ప్రధానమంత్రి అవుతారని భావించారు. అయితే లిజ్ ట్రస్ కుఎక్కువ మంది మద్దతు పలకడంతో ఆమె బ్రిటన్ ప్రధాని అయ్యారు. రిషి సునాక్ కు భారతీయ సంస్కృతితో ఉన్న సంబంధాల గురించి తెలుసుకుందాం.
1) బ్రిటన్ పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు భగవద్గీతపై రిషి సునాక్ ప్రమాణం చేశారు. అలా చేసిన మొదటి యూకే పార్లమెంటేరియన్ సునాక్ మాత్రమే.
2 ) రిషి సునాక్ తల్లిదండ్రులిద్దరూ భారత సంతతికి చెందినవారు. సునక్ తల్లిదండ్రులు ఫార్మసిస్ట్‌లు, 1960లలో తూర్పు ఆఫ్రికా నుండి యూకేకు వలస వచ్చారు.
3) రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్క.
4) బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఎక్స్‌చెకర్ ఛాన్సలర్‌గా రిషి సునాక్ డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు.
5) రిషి సునాక్ తరచుగా అతని వారసత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. కుటుంబం విలువలు, సంస్కృతి గురించి తరచుగా అనేక విషయాలు చెబుతూ ఉంటారు.
6) రిషి సునాక్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కూడా
7) రిషి సునాక్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తన అత్తమామలను కలవడానికి తరచుగా బెంగుళూరుకు వస్తుంటారు.
8) 2022 వేసవిలో ప్రధానమంత్రి పదవికి పోటీలో ఉండి ప్రచారం చేస్తున్న సమయంలో, రిషి సునాక్ తన విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన సూట్లు, బూట్లతో సహా పలు అంశాలలో విమర్శలను ఎదుర్కొన్నారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో భగవద్గీత తరచుగా తనను కాపాడుతుందని, తాను ఎలా ఉండాలో గుర్తు చేస్తుందని రిషి సునాక్ ఒకానొక సందర్భంలో తెలిపారు.
9) రిషి సునాక్ ఆస్తుల నికర విలువ 700 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుంది. యూకేలో ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. యార్క్‌షైర్‌లో ఒక ఇంటిని కలిగి ఉండటమే కాకుండా, రిషి సునాక్, అతని భార్య అక్షత సెంట్రల్ లండన్‌లోని కెన్సింగ్టన్‌లో ఆస్తులు కలిగి ఉన్నారు.
10) శారీరకంగా ధృడంగా ఫిట్‌గా ఉండటానికి రిషి సునాక్ క్రికెట్ ఆడటానికి ఇష్టపడతారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..