Boat Blocks Highway: నిన్నగాక మొన్న.. ఓ భారీ నౌక సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుని భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన విషయం మరువకముందే.. అచ్చం అలాంటి ఘటనే తాజాగా అమెరికాలో చోటు చేసుకుంది. అయితే, ఇది ఏ కాలువలోనో.. నదీ మార్గంలోనో కాదులేండి. రోడ్డుపై ఓ ట్రక్కులో తీసుకెళ్తున్న పడవ.. ప్రమాదవశాత్తు కంటైనర్ నుంచి జారి రోడ్డుపై పడింది. అలా పడిన పడవ.. బోల్తా కొట్టి రోడ్డుకు అడ్డు గోడలా నిలిచింది. అయితే.. ఈ పడవ మరీ పెద్దది కాదు.. అలా అని చిన్నదీ కాదు. మొత్తానికి ఓడ కారణంగా సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్ అయినట్లుగా.. ఈ పడవ కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ పడవ వల్ల ఫ్లోరిడా హైవేపై గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఓడను, ప్రస్తుతం రోడ్డుపై అడ్డంగా పడిన పడవను పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ‘బోట్లు అన్నీ యూనియన్ ఏర్పాటు చేస్తున్నాయా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఇది పడవల వారం’ అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. మొత్తానికి వరుసగా జరుగుతున్న పడవల ప్రమాదంపై నెటిజన్లు ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు.
Also read: