పంతం వీడని ఇజ్రాయెల్‌-వెనక్కి తగ్గని హమాస్‌, పసిపిల్లల రోదనలతో ప్రతిధ్వనిస్తున్న గాజా

అంతర్జాతీయ సమాజం ఎంతగా చెబుతున్నా ఇజ్రాయెల్‌ వినడం లేదు..పాలస్తీనా హమాస్‌ మిలటరీ విభాగం లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తూనే ఉంది.

పంతం వీడని ఇజ్రాయెల్‌-వెనక్కి తగ్గని హమాస్‌, పసిపిల్లల రోదనలతో ప్రతిధ్వనిస్తున్న  గాజా
Palestinian
Follow us

| Edited By: Phani CH

Updated on: May 20, 2021 | 10:38 AM

అంతర్జాతీయ సమాజం ఎంతగా చెబుతున్నా ఇజ్రాయెల్‌ వినడం లేదు..పాలస్తీనా హమాస్‌ మిలటరీ విభాగం లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కాల్పులు ఆపాలంటూ ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడం లేదు..పెద్దన్న అమెరికా కూడా చెప్పి చూసింది. హింసను ఆపాలంటూ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పి చూశారు. పెద్దన్న మాటలను పెద్దగా లెక్క చేయడం లేదు ఇజ్రాయెల్‌.

హమాస్‌ పట్టు వీడటం లేదు. ఉభయవర్గాల కారణంగా పరిస్థితి భయానకంగా మారుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాలస్తీనా- ఇజ్రాయిల్‌ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం. రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. యుద్ధవిమానాలు, రాకెట్‌ లాంచర్లతో రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ మారణహోమంలో… అమాయకులు బలైపోతున్నారు.. పాపం పుణ్యం ప్రపంచమార్గం అభం శుభం తెలియని చిన్నారులు బాంబుల దాడుల్లో సమాధి అవుతున్నాయి. యుద్ధభూమిలో చిన్నారుల వ్యథలు ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి. పాలస్తీనాకు ఇది కొత్త కాదు.. అనాదిగా ఇలాంటి దారుణాలను ఎదుర్కొనే వస్తున్నది. అమ్మ పొత్తిళ్లలో ఆడుకోవల్సిన పసిపాపలు కూడా కన్నుమూస్తున్నారు. భవిష్యత్తు మీద ఎన్నో కలలు పెట్టుకున్న చిన్నారుల జీవితాలు ఛిద్రమవుతున్నాయి.. బాంబుల దాడుల్లో వారి బంగారు కలలు సమాధి అవుతున్నాయి. తమకు ఏం జరిగిందో కూడా వారికి తెలియదు. ఎవరు ఎందుకు దాడులు చేస్తున్నారో కూడా తెలియదు.

గాజాలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.. నేలమట్టమైన భవనాలు దర్శనమిస్తున్నాయి. రక్తపు ధారలు రోడ్లమీద పారుతున్నాయి. నదినె అబ్దెల్‌ తైఫ్‌ అనే పదేళ్ల బాలిక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.. తన ఇంటి ముందు కనిపిస్తున్న శిథాలలను చూసి కన్నీరు పెడుతున్న ఆ బాలికను చూస్తుంటే కడుపు రగిలిపోతున్నది. అక్కడి భీతావహ వాతావరణానికి ఆ వీడియోనే నిదర్శనం.. ఆ చిన్నారి అడుతున్న ప్రశ్నలకు ఎవరు జవాబివ్వాలి.? అంతర్జాతీయ సమాజం సమాధానం చెబుతుందా? తానింకా చిన్న పిల్లనేనని, డాక్టర్‌ అయి పేదలకు సేవా చేయాలని అనుకున్నానని, తన బంగారు భవిష్యత్తును చిదిమేశారని, తన ఆశలను నాశనం చేశారని ఆక్రందిస్తున్న ఆ బుజ్జి పాపాయిని ఎవరు ఓదారుస్తారు? అసలు సమాధానం చెప్పే ధైర్యం ఎవరికన్నా ఉందా? ఇప్పటివరకూ గాజాలో 80 మందికి పైగా మంది చిన్నారులు మరణించారంటే.. ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోచ్చు…!! బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల ఏడుపులు గుండెలను పిండేస్తున్నాయి.. నెత్తుట తడిసిన శిథిలాలు కూడా మౌనంగా రోదిస్తున్నాయి. గాజాలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. నగర ప్రజలకు తినడానికి తిండి లేదు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దౌర్భాగ్యపు పరిస్థితి. ఇజ్రాయెల్‌ రాకెట్ల దాడుల్లో కొందరు మరణిస్తుంటే ఆకలిదప్పులతో మరికొందరు కన్నుమూస్తున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లి తినడానికి ఏమైనా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు.. బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎప్పుడు ఏ రాకెట్ విరుచుకు పడుతుందో.. ఎక్కడ తమ కుటుంబాలు బలైపోతాయో అన్న భయంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

మహ్మద్‌ అల్‌ హదీది విషాదగాథ వింటే ఎవరికైనా గుండె తరుక్కోక మానదు.. 37 ఏళ్ల హదీది- మహా అబు హతాబ్‌లది ముచ్చటైన సంసారం.. నలుగురు కుమారులు. చిన్నవాడికి అయిదు నెలలుంటాయి. రంజాన్‌ రోజున వీరందరికి కొత్తబట్టలు వేసి బంధువుల ఇంటికి వెళ్లింది హతాబ్‌. గాజా నగరానికి కొంచెం దూరంలో ఉన్న షతీ శరణార్థి శిబిరంలో ఉన్న చుట్టాలను కలుసుకుంది. ఆనందంగా చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఆ రాత్రి అక్కడే ఉంటానంటూ భర్తకు చెప్పింది.. హదీది కూడా సరే అన్నాడు..అన్నాడు కానీ ఆ రాత్రి ఎందుకో హదీదికి సరిగ్గా నిద్ర పట్టలేదు.. ఏదో అపశకునం ధ్వనించింది. కీడు జరగబోతున్నదని అనిపించింది. బాంబుల వికృతధ్వనులకు వేకువ జామున ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు.. పరుగులు తీస్తూ భార్య బిడ్డలు ఉన్న చోటుకు వెళ్లాడు. అక్కడ ఏమీ లేదు. అంతా శిథిలమైపోయింది. హదీది హృదయం కూడా ముక్కలయ్యింది. రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది. శిథిలాలలను తొలగించింది.. భార్య, ముగ్గురు కొడుకుల మృతదేహలను బయటకు తెచ్చింది. అప్పటికే నిస్సత్తువ ఆవరించి కూలబడిపోయాడు హదీది. అప్పుడు వినిపించింది చిన్నకొడుకు ఒమర్‌ ఏడుపు. సహాయక బృందాల చేతిలో ఉన్న బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. దుఃఖించాడు. క్షణం ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఇప్పుడు హదీదికి మిగిలింది ఒమర్‌ ఒక్కడే. వెతకాలే కానీ అక్కడ ఇలాంటి హదీదిలు గడప గడపకు కనిపిస్తారు. నెతన్యాహు…ఈ దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయా? అభాగ్యుల రోదనలు మీకు వినిపిస్తున్నాయా? ఈ ఆధిపత్య పోరుకు ఎప్పుడు తెరదించుతారు? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే! అవి ఇజ్రాయెల్‌ వాళ్లవి కావచ్చు. పాలస్తీనా వాళ్లవీ కావచ్చు.. ఇప్పటికైనా అహం వీడి ఉభయ వర్గాలు శాంతిని నెలకొల్పితే ప్రపంచానికి మంచిది!

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )

AP Assembly Budget 2021 Live: మొద‌లైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతోన్న గ‌వ‌ర్న‌ర్‌..

Private Teachers : ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతోన్న ప్రయివేటు టీచర్లు.. యాదాద్రి జిల్లాలో ఉసురు తీసుకున్న మాస్టారు