Train Accident in Pakistan: పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు ఢీకొని.. దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్ లోని ఘోట్కీ రేతి, ధహర్కి రైల్వే స్టేషన్ మధ్య సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ – మిల్లట్ ఎక్స్‌ప్రెస్ ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలియగానే అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టారు. మృతులను, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న సర్ సయేద్ ఎక్స్ ప్రెస్‌ను.. కరాచీ నుంచి సర్గోధాకు వెళ్లే మిల్లట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ఘటనలో 13నుంచి 14 బోగిలు పట్టాలు తప్పినట్లు సమాచారం.
ఈ ఘటన అనంతరం ఘోట్కీ, ధార్కి, ఒబారో, మీర్ పూర్ మాథెలో ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఘోట్కీ డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలియజేశారు. గాయపడిన ప్రయాణీకులకు వైద్య సహాయం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: