Pakistan Political Crisis: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్(Imran Khan)కు కష్టకాలంలో భారత్(India) గుర్తుకొచ్చింది. భారత విదేశాంగ నీతి అద్భుతం .. ఏకకాలంలో అమెరికా(America) , రష్యా(Russia)లను డీల్ చేస్తున్నందుకు అభినందనలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ . తన ప్రభుత్వం పతనం అంచున ఉన్న సమయంలో విపక్ష నేతలను బందిపోట్లతో పోల్చారు. పతనం అంచున ఉన్న తన సర్కార్‌ను కాపాడుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు ఇమ్రాన్. తన పదవి ఉంటుందో? ఊడుతుందో? తెలియని అయోమయ స్థితిలో ఇమ్రాన్ హఠాత్తుగా భారత విదేశాంగవిధానంపై ప్రశంసలు కురిపించారు. విపక్ష పార్టీల ఎంపీలు బందిపోట్ల లాగా తయారయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. రాజీనామా చేస్తా కానీ, విపక్షాల ఒత్తిళ్లకు లొంగేది లేదన్నారు ఇమ్రాన్. ఈనెల 28 పాక్ పార్లమెంట్‌లో అవిశ్వాస పరీక్షలో ఓడిపోతే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది.
అమెరికాతో క్వాడ్ కూటమిలో భారత్ భాగస్వామి అయినప్పటికి రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబించడం అభినందనీయమని అన్నారు ఇమ్రాన్‌ఖాన్. ‘భారత విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్ర మూలాలున్న విధానమన్నారు. అమెరికాకు మిత్రదేశంగా ఉంటూనే రష్యా నుంచి భారత్‌కు చమురు అందుతోందన్నారు. భారత విదేశాంగ విధానం ప్రజల అభ్యున్నతి కోసమే ఉందన్నారు. మన పొరుగుదేశం భారత్‌ను నేను అభినందిస్తున్నా. స్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని వాళ్లు అనుసరిస్తున్నారు. భారత్ క్వాడ్ కూటమిలో భాగస్వామి.. అమెరికాతో ఒప్పందం ఉంది. కాని మేము తటస్థులమని భారత్ చెబుతోంది. రష్యా నుంచి ముడిచమురు కొంటున్నారు. రష్యాపై ఆంక్షలను పట్టించుకోవడం లేదు. తమ ప్రజల మేలు కోసమే భారత్ ఇలా చేస్తోందంటూ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
అలాగే, తన ప్రత్యర్థులపై ఇమ్రాన్ తీవ్రంగా మండిపడ్డారు. మీరు మనస్సాక్షిని అమ్ముకున్నారని పాక్ ప్రజలకు అర్థమైందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీ పేర్ల ముందు శాశ్వతంగా దేశద్రోహి అన్న పదం మిగిలిపోతుందని ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం మన ముందు రెండే రెండు దారులున్నాయని, బడా బాబుల వైపు నిలబడడమా? పాక్ ప్రజల వైపు నిలబడడమా? అన్నది తేల్చుకోవాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశ ప్రజలు కూడా ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని కోరారు. 25 సంవత్సరాలుగా దోచుకున్న డబ్బులతో ఎంపీలను కొనాలని చూస్తున్నారని ఇమ్రాన్ మండిపడ్డారు.
I salute India for pursuing an independent foreign policy always, today India is an ally of USA and Russia at the same time: PM Imran Khan pic.twitter.com/hJZcfMQRan
— Murtaza Ali Shah (@MurtazaViews) March 20, 2022
Read Also…
AP News: పన్ను కట్టలేదని ఇళ్లకు తాళం.. పిఠాపురంలో మున్సిపల్ అధికారుల నిర్వాకం