పాక్ మళ్లీ పాత పాటే.. ఉగ్రవాదులపై తీరు మార్చుకోని దాయాది దేశం..
ఉగ్రవాదుల అప్పగింత విషయంలో పాక్ మళ్లీ పాత పాటే పాడింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ను తమకు అప్పగించాలంటూ భారత్ ఎప్పుటినుంచో కోరుతుంది. అయితే అతడు తమ వద్ద లేడని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో అన్నారు. ఒకవేళ భారత్ సమాచారమిస్తే సంతోషంగా అతడిని అరెస్ట్ చేస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మసూద్ అజార్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. భారత్‌లో ఎన్నో దాడులకు సూత్రధారి అయిన అతడిని తమకు అప్పగించాలంటూ చాలా సార్లు పాక్‌ను కోరినా స్పందన లేదు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ లో మసూద్ టార్గెట్‌గా ఇండియన్ ఆర్మీ భారీ దాడులు నిర్వహించింది. అయితే అతడు తృటిలో తప్పించుకోగా.. అతని ఫ్యామిలీలో 10మంది మరణించారు. ఆ సమయంలో మసూద్ ఇండియాకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. భారత్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానంటూ ప్రగల్భాలు పలికాడు. అయితే మసూద్ పాక్‌లోనే ఉన్నాడని భారత్ చెబుతున్నా.. పాక్ మాత్రం కొట్టిపారేస్తుంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో మసూద్ అజార్, హఫీజ్ సయ్యద్‌లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మసూద్ తమ దేశంలో లేడని అన్నారు. అసలు అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని.. ఒకవేళ మసూద్ పాక్‌లోనే ఉన్నాడని భారత్ సమాచారమిస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తామంటూ సెటైర్ వేశారు.
అదేవిధంగా భారత్ ఆరోపిస్తున్నట్లు హఫీజ్ సయీద్ సైతం తమ దేశంలో స్వేచ్ఛగా లేడని భుట్టో అన్నారు. అతడిని ఎప్పుడో అరెస్ట్ చేసి జైల్లో వేశామని చెప్పారు. ‘‘హఫీజ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే మసూద్‌ను అరెస్ట్ చేయలేకపోయాం. అతడు ఇప్పుడు పాకిస్థాన్‌లో లేడు. ఆప్ఘనిస్థాన్‌లో ఉండొచ్చు. అక్కడ నాటో దళాలు చేయలేని పనిని తాము ఎలా చేయగలం. ఒకవేళ భారత్ అతడిని పట్టుకుంటే చాలా సంతోషిస్తాం’’ అని భుట్టో అన్నారు. అంతేకాకుండా సింధూ నదీ జలాలపైనా భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనన్నారు. భారత్ సింధూ జలాలను ఆపితే వారి రక్తం అందులో పారుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా మసూద్ అజార్ 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు సూత్రధారి. 2019లో ఐక్యరాజ్యసమితి అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో కాందహార్ హైజాక్ తర్వాత IC-814 ప్రయాణీకులకు బదులుగా అతన్ని భారత్ విడుదల చేశారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ముంబై దాడుల్లో కీలకంగా వ్యవహరించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..