Thailand: థాయ్‌లాండ్‌లో 13 లక్షల మందికి అస్వస్థత.. అసలక్కడ ఏం జరుగుతోంది..?

|

Mar 13, 2023 | 6:34 PM

థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారుతోంది. గడచిన వారం రోజుల్లోనే దాదాపు 2 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆ దేశ రాజధాని అయిన బ్యాంకాక్‌ నగరం మొత్తం ప్రమాదకర స్థాయిలో దట్టమైన పొగ

Thailand: థాయ్‌లాండ్‌లో 13 లక్షల మందికి అస్వస్థత.. అసలక్కడ ఏం జరుగుతోంది..?
Thailand Air Pollution
Follow us on

థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారుతోంది. గడచిన వారం రోజుల్లోనే దాదాపు 2 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆ దేశ రాజధాని అయిన బ్యాంకాక్‌ నగరం మొత్తం ప్రమాదకర స్థాయిలో దట్టమైన పొగ అలముకొని ఉంది. వాహనాల ఉద్గారాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బనఉద్గారాలు, పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వెలువడే పొగ కారణంగా గత కొంతకాలంగా థాయ్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వాయు కాలుష్యం మూలంగా 1.3 మిలియన్లకు పైగా థాయ్‌ ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత వారం రోజుల్లోనే దాదాపు 2,00,000ల మంది ఆసుపత్రి పాలైనట్లు నివేదించింది.

‘ప్రసిద్ధ టూరిస్ట్‌ ప్రాంతమైన బ్యాంకాక్‌లో దాదాపు 11 మిలియన్ల మంది (కోటి 13 లక్షల మంది) నివసిస్తున్నారు. గత మూడురోజులుగా బ్యాంకాక్‌లోని 50 జిల్లాల్లో PM2.5 కంటే అధిక స్థాయిలు నమోదయ్యాయి. గాలిలోని అతిసూక్ష్మ ధూళి కణాలు రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను దెబ్బతీస్తాయి. పిల్లలు, గర్భిణీ మహిళలు ఇళ్లుదాటి బయటకు రావద్దు. అత్యవసరమై బయటికి వస్తే ఎన్‌95 యాంటీ పొల్యూషన్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. గత జనవరి-ఫిబ్రవరి నెలల్లో అక్కడి వాయుకాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రం హోం ఇచ్చాం. పరిస్థితి మరింత దిగజారితే ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికైనా వెనుకాడబోము. బ్యాంకాక్‌లోని చిన్నపిల్లల నర్సరీలలో ఎయిర్ ప్యూరిఫైయర్‌లతో ప్రత్యేక ‘నో డస్ట్ రూమ్‌లను’ ఏర్పాటు చేశాం. అలాగే వాహన ఉద్గారాలను పర్యవేక్షించడానికి చెక్‌పోస్టులను సైతం ఏర్పాటు చేశామని’ థాయ్‌ ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా థాయ్‌లాండ్‌లోని వ్యవసాయ ప్రాంతమైన చియాంగ్ మాయిలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అక్కడ ప్రతి యేటా రైతులు పంటల వ్యర్ధాలను ఈ సమయంలో పెద్ద ఎత్తున తగులబెడుతుంటారు. ప్రపంచంలోనే మూడో అత్యంత కలుషితమైన నగరంగా నిలిచినట్లు ఐక్యూ ఎయిర్‌ సంస్థ తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.