Myanmar: దారుణం.. పాఠశాలపై సైనిక హెలికాప్టర్లతో కాల్పులు.. ఆరుగురు చిన్నారుల మృతి

|

Sep 21, 2022 | 7:50 AM

మయన్మార్‌ సైనిక పాలకులు బరి తెగించారు. సైనిక హెలిక్యాప్టర్లు ఓ స్కూల్‌ మీద కాల్పులు జరపగా ఆరుగురు విద్యార్థుల ప్రాణాలు పోయాయి..

Myanmar: దారుణం.. పాఠశాలపై సైనిక హెలికాప్టర్లతో కాల్పులు.. ఆరుగురు చిన్నారుల మృతి
Myanmar School Firing
Follow us on

Myanmar School Firing: ప్రజాస్వామ్యం గొంతు నొక్కి కర్కషంగా దేశాన్ని పాలిస్తున్న మయన్మార్‌ సైనిక జుంటా ఆడగాలు మితిమీరుతున్నాయి. తిరుగుబాటుదారులపై ఎక్కుపెట్టిన తుపాకీని సాధారణ పౌరుల మీదకు కూడా తిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సాగింగ్‌ ప్రాంతం లెట్‌యట్‌కోనేయ గ్రామంలోని ఓ స్కూలు మీద సైనిక హెలిప్యాప్టర్‌ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మరణించారు. 17 మంది గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూలు మీద కాల్పులు జరపడాన్ని మయన్మార్‌ సైన్యం సమర్ధించుకుంది. తిరుగుబాటుదారులు ఈ పాఠశాలలో నక్కి తమపై కాల్పులు జరిపినందువల్లే, తాము ఎదురుదాడికి దిగామని వివరణ ఇచ్చింది. రెబల్స్‌ ప్రజలను కవచాలుగా వాడుకొని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సైనిక అధికారులు. పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ గ్రూపునకు చెందిన తిరుగువాటుదారులు ఆయుధ రవాణా చేస్తున్నారని సైన్యం చెబుతోంది. తనిఖీలకు వచ్చిన సైనిక హెలికాప్టర్లపై దాడి చేయడంతో.. ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని అంటున్నారు.

కాగా, మయన్మార్‌ సైన్యం చనిపోయిన విద్యార్థుల శవాలను ఘటనాస్థలం నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని ఓ పట్టణానికి తీసుకెళ్లి ఖననం చేసిందని స్థానికులు చెబుతున్నారు. మయన్మార్‌ సైన్యం ఉద్దేశ పూర్వకంగానే పాఠశాలలను లక్ష్యంగా చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు.. కాల్పులు జరిగిన స్కూల్‌ ప్రాంగణం విజువల్స్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సైనిక ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం