World Peace: చిన్న చిన్న సమస్యలకు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం వల్ల ప్రపంచ దేశాలకు ఆర్థికంగా, వాణిజ్యంగా ఎంతో నష్టం జరుగుతుందని మెక్సికో అధ్యక్షులు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఐదేళ్ల పాటు ప్రపంచ దేశాల మధ్య ఎటువంటి యుద్ధాలు లేకుండా సంధి కుదిర్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదిస్తూ ఓ లేఖను రాశారు. ముగ్గుర సభ్యుల కమిటీలో పోప్ ప్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని సభ్యులుగా నియమించాలని మెక్సికో అధ్యక్షులు ఒబ్రాడోర్ రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. వీరు ముగ్గురు సమావేశమై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ఆపడం, ఐదేళ్ల పాటూ ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా ఒక సంధిని కుదర్చాలని.. తద్వారా అన్ని దేశాలు అభివృద్ధిపై దృష్టిపెట్టడంతో పాటు.. ఆదేశ ప్రజలకు మంచి పాలనను అందించడానికి అంకితభావంతో పనిచేసే వీలుంటుందన్నారు.
యుద్ధం ద్వారా ఎదురయ్యే పరిస్థితుల వల్‌ల ప్రజలు ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ సమావేశమై యుద్ధాలు జరగకుండా ఒక ఒప్పందాన్ని ఆమోదించడం వల్ల ఐదేళ్ల పాటు ప్రజలు హింస లేకుండా శాంతియుతంగా జీవించవచ్చని మెక్సికో అధ్యక్షులు ఒబ్రాడోర్ అభిప్రాయపడ్డారు. తక్షణమే ఈదిశగా ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ శాంతి కోసం తన ప్రతిపాదనను చైనా, రష్యా, అమెరికాలు సమర్థిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశాల మధ్య ఘర్షణ వల్ల కలిగే ప్రయోజనం ఏమి లేదని.. దీని ద్వారా ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. ఆహార కోరత, పేదరికం, ద్రవ్యోల్పణం వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు తన ప్రతిపాదనకు మద్దతుగా నిలవాలని మెక్సికో అధ్యక్షులు ఒబ్రాడోర్ కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..