South Korea Rains: దక్షిణ కొరియాలో కుండబోత వర్షాలు.. 1942 నుంచి ఇదే అత్యధికం.. జలదిగ్భంధంలో అనేక నగరాలు
దక్షిణ కొరియాలో భారీ వరదలు ముంచెత్తాయి రాజధాని సియోల్‌లో కుంభవృష్టి కురియడంతో జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు
South Korea Rains: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సియోల్ లో కుంభవృష్టి కురియడంతో జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. సియోల్ నగరం చెరువులా మారింది. భారీ వర్షాలు, వరదలకు రోడ్లు మునిగిపోయాయి. కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటితో రోడ్లు, అండర్‌పాస్‌లను కూడా మూసివేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.. చాలా చోట్ల రోడ్లపై కార్లు నీటమునిగిపోయాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు.
సియోల్ లో కొన్ని చోట్ల గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజులపాటు వర్షపాతం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. కొన్ని వీధుల్లో భారీగా వరద నీరు చేరుతూ ఉండడం వల్ల సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఓ ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న ఇంట్లో ఉన్న ముగ్గురిని రక్షించడం సిబ్బందికి సాధ్యం కాలేదు. సియోల్ సమీపంలోని ఇంచియాన్, గ్యాంగీల్లో గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సియోల్‌లోని డాంగ్జాక్ జిల్లాలో గంటకు 141.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 1942 నుంచి ఇదే అత్యధికం. ఇది దశాబ్దాలలో అత్యంత దారుణమైన వర్షపాతం అని వాతావరణశాఖ తెలిపింది.. సియోల్‌లో భారీ వర్షపాతానికి రవాణా వ్యవస్థ స్తంభించింది.నగరంలో రైల్వే సేవలు పూర్తిగా ఆగిపోయాయి.దీంతో ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు అధికారులను ఆదేశించారు. భారీ వర్షానికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ దాదాపుగా అతలాకుతలం అయింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అడవులకు సమీపంలో నివసించే వారు కూడా ముందుజాగ్రత్తగా ఖాళీ చేయాలని సూచించింది.. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..