పోలీసులు లంచాలు తీసుకుంటారని అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాము. మరి కొంత మంది డబ్బులు కాకుండా వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్తుంటారని వింటుంటాం. అయితే అందరు పోలీసులు అలాగే ఉంటారనుకోవడం పొరపాటు. పోలీసుల్లో మంచోళ్లు కూడా ఉంటారు. కానీ, చెడ్డ పోలీసుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంటుంది. ఇక తాజాగా పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కొంత మంది పోలీసులు ‘జానీ అండ్ జుగ్ను’ అనే రెస్టారెంట్‌లో బర్గర్లు ఆర్డర్ చేశారు. అయితే అవన్నీ ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఇందుకు రెస్టారెంట్ సిబ్బంది నిరాకరించారు. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా మాటనే వినరా.. అంటూ ఆ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 19 మంది సిబ్బందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు పోలీసులు. వారిలో కిచెన్ సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో ఆ హోటల్‌ను మూసివేయాల్సి వచ్చింది.
దీంతో ఆ రెస్టారెంట్ యజమాని తమ సమస్యను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మా రెస్టారెంట్‌లోని కిచెన్ టీమ్‌ను ఇబ్బంది పెట్టడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి ఘటనలకు ఇదే ఆఖరి రోజు కావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. దీంతో నెటిజనులు, ఆ రెస్టారెంట్ అభిమానులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే అరెస్టు అయిన సిబ్బంది మొత్తం యువతే. వివిధ యూనివర్శిటీల్లో చదువుతూ పార్ట్‌టైమ్ కింద ఆ రెస్టారెంటులో పని చేస్తున్నారట. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై, ఆ రెస్టారెంట్ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పోలీసులకు హెచ్చరించారు. సీనియర్ ప్రొవిన్సియల్ అధికారి ఇనామ్ ఘనీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.‘ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు’ అని అన్నారు.