నెతన్యాహుకు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం!
ఇజ్రాయెల్ రాజకీయాల్లో అనూహ్య మలుపుతో నెతన్యాహుకు గట్టి సవాల్ ఎదురైంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆయనకు కాకుండా మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐసెన్‌కాట్‌కు దక్కింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నెతన్యాహును అధికారానికి దూరం చేయాలని చూస్తున్న ప్రతిపక్ష కూటమికి ఇది పెద్ద అవకాశంగా కనిపిస్తోంది. అయితే ఐసెన్‌కాట్ నిజంగానే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? ఆయనకు మద్దతు ఇచ్చే పార్టీలేవి? నెతన్యాహు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది?

ఇజ్రాయెల్ రాజకీయాల్లో అనూహ్య మలుపుతో నెతన్యాహుకు గట్టి సవాల్ ఎదురైంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆయనకు కాకుండా మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐసెన్‌కాట్‌కు దక్కింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నెతన్యాహును అధికారానికి దూరం చేయాలని చూస్తున్న ప్రతిపక్ష కూటమికి ఇది పెద్ద అవకాశంగా కనిపిస్తోంది. అయితే ఐసెన్‌కాట్ నిజంగానే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? ఆయనకు మద్దతు ఇచ్చే పార్టీలేవి? నెతన్యాహు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది?
నెతన్యాహును పక్కనపెట్టి ఐసెన్‌కాట్‌కు పిలుపు!
ఇజ్రాయెల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. అధ్యక్షుడు హెర్జోగ్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఎక్కువ మంది ఎంపీలు గాడి ఐసెన్‌కాట్‌కు మద్దతు ప్రకటించడంతో ఆయనకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. శనివారం సాయంత్రం ఈ నిర్ణయాన్ని ఐసెన్‌కాట్‌కు తెలియజేశారు. ఆదివారం అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలను అప్పగించనున్నారు.
67 మంది ఎంపీల మద్దతు!
ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్నికల్లో ఐసెన్‌కాట్ నేతృత్వంలోని నాలుగు పార్టీల కూటమికి 48 స్థానాలు వచ్చాయి. నెతన్యాహు నేతృత్వంలోని కుడిపక్ష, మతపరమైన పార్టీల కూటమికి 53 స్థానాలు దక్కాయి.
అయితే అధ్యక్షుడి వద్ద జరిగిన సంప్రదింపుల్లో ఐసెన్‌కాట్‌కు 67 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. ఇందులో అరబ్ పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. నెతన్యాహుకు 46 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించింది. ఈ మద్దతు ఆధారంగానే ఐసెన్‌కాట్‌ను అధ్యక్షుడు ఎంపిక చేశారు. అయితే అధ్యక్షుడి వద్ద మద్దతు ప్రకటించడం వేరు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టడం వేరు. అవసరమైన 61 మంది సభ్యుల మద్దతును కూడగట్టడం ఇప్పుడు ఐసెన్‌కాట్ ముందున్న అసలైన పరీక్ష. ఆయనకు 28 రోజుల సమయం ఉంటుంది. అవసరమైతే మరో 14 రోజుల గడువు కూడా పొడిగించవచ్చు.
అరబ్ పార్టీల మద్దతు తీసుకుంటారా?
ఐసెన్‌కాట్‌కు అరబ్ పార్టీల ఎంపీల మద్దతు ఉంది. అయితే వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన విముఖంగా ఉన్నారు. మరోవైపు యునైటెడ్ తోరా జుడాయిజం, షాస్ అనే రెండు పార్టీల మద్దతు పొందగలిగితే ఆయనకు సరిగ్గా 61 స్థానాల బలం లభిస్తుంది. ఈ రెండు పార్టీలను తనవైపు తిప్పుకోవడంలో ఐసెన్‌కాట్ విజయం సాధిస్తారా? లేక అరబ్ పార్టీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నెతన్యాహును గద్దె దించడమే అరబ్ పార్టీల లక్ష్యం!
అరబ్ పార్టీల నేతలు నెతన్యాహు ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. జాయింట్ లిస్ట్‌కు చెందిన సీనియర్ నేత అహ్మద్ తిబీ మాట్లాడుతూ ఐసెన్‌కాట్‌కు మద్దతు ఇవ్వడం ఊహించిన పరిణామమేనని తెలిపారు. నెతన్యాహు, ఐసెన్‌కాట్ కలిసి జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారేమోనని తాము మొదట ఆందోళన చెందామని చెప్పారు.ఐసెన్‌కాట్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా నెతన్యాహు, జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్-గ్విర్, ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్‌లతో కూడిన ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలనుకుంటున్నట్లు వివరించారు. ఐసెన్‌కాట్ అరబ్ పార్టీలను ప్రభుత్వంలోకి తీసుకోకపోయినా బయటి నుంచి వాటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉంది.
గాజా యుద్ధ సమయంలో నెతన్యాహుతో కలిసి పనిచేశారు!
గాడి ఐసెన్‌కాట్‌కు ఇజ్రాయెల్ సైన్యంలో సుదీర్ఘ అనుభవం ఉంది. 2015 నుంచి 2019 వరకు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత నెతన్యాహు నేతృత్వంలోని యుద్ధ కేబినెట్‌లో పరిశీలకుడిగా ఉన్నారు. ఒకప్పుడు నెతన్యాహు ప్రభుత్వ యుద్ధ కేబినెట్‌లో భాగమైన ఐసెన్‌కాట్ ఇప్పుడు అదే నెతన్యాహుకు ప్రత్యామ్నాయంగా ప్రధానమంత్రి పీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుండటం ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.
ఐసెన్‌కాట్ విఫలమైతే మళ్లీ ఎన్నికలేనా?
ఐసెన్‌కాట్‌కు ఇచ్చిన 28 రోజుల గడువులో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే అధ్యక్షుడు మరో అభ్యర్థికి అవకాశం ఇస్తారు. రెండో అభ్యర్థి కూడా విఫలమైతే పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యుల మద్దతుతో మూడో అభ్యర్థిని ఎంపిక చేయవచ్చు. ఆ అభ్యర్థికి చివరిగా 14 రోజుల సమయం ఉంటుంది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమైతే 90 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటివరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.
ఇదిలా ఉండగా.. అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్‌కాట్ ప్రభుత్వం ఏర్పడితే ఇజ్రాయెల్ కుప్పకూలుతుందని నెతన్యాహు ఆరోపించారు. ఇస్లామిస్ట్ పార్టీలపై ఆధారపడే ప్రభుత్వం దేశాన్ని లోపలి నుంచే బలహీనపరుస్తుందని విమర్శించారు. మొత్తానికి ఇజ్రాయెల్‌లో ఇప్పుడు అందరి చూపు ఐసెన్‌కాట్‌పైనే ఉంది. 28 రోజుల్లో అవసరమైన మద్దతును కూడగట్టి నెతన్యాహు పాలనకు ముగింపు పలుకుతారా? లేక ప్రభుత్వ ఏర్పాటులో విఫలమై దేశాన్ని మరో ఎన్నికల దిశగా నడిపిస్తారా? అనేది తేలాల్సి ఉంది.