Iran Hijab Protest: హిజాబ్‌కు వ్యతిరేకంగా కదం తొక్కిన ఇరాన్ మహిళలు.. జుత్తు కత్తిరించుకుని..

హిజాబ్‌కు వ్యతిరేకంగా భగ్గుమంది ఇరాన్‌.. పోలీసుల అరెస్టుతో మరణించిన మాహ్సా అమినికి నివాళిగా అక్కడి మహిళలు జుట్టు కత్తిరించుకొని హిజాబ్‌లను తగలబెడుతున్నారు..

Iran Hijab Protest: హిజాబ్‌కు వ్యతిరేకంగా కదం తొక్కిన ఇరాన్ మహిళలు.. జుత్తు కత్తిరించుకుని..
Iran Hizab Protest

Updated on: Sep 20, 2022 | 7:10 AM

Iran Hijab Protest: హిజాబ్‌కు వ్యతిరేకంగా భగ్గుమంది ఇరాన్‌.. పోలీసుల అరెస్టుతో మరణించిన మాహ్సా అమినికి నివాళిగా అక్కడి మహిళలు జుట్టు కత్తిరించుకొని హిజాబ్‌లను తగలబెడుతున్నారు.. మహిళలను అణచివేస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు కదంతొక్కుతున్నారు. అక్కడి నారీ లోకం చేపట్టిన ఈ ఆందోళనకు యువతరం సైతం మద్దతుగా నిలిచింది. ఇరాన్‌లో అమలులో ఉన్న షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్‌ ధరించాలి. దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ నిబంధనను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు ఈ ఏడాది జులైలో ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్‌ను ఉల్లంఘించే మహిళలను జరిమానాలతో పాటు అరెస్టుచేసేందుకు ఆదేశాలిస్తూ ఇందు కోసం ప్రత్యేకంగా ‘మొరాలిటీ పోలీసు’ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళ హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కస్టడీలోనే ఆమె గుండెపోటుకు గురై కోమాలోకి వెళ్లిపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కస్టడీలో ఆమెను తీవ్రంగా హింసించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇరాన్‌ పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మహ్సా అమిని మరణం ఇరాన్‌ మహిళలను కలచివేసింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇందులో భాగంగా తమ జుట్టును కట్‌ చేసుకొని, హిజాబ్‌లను తగులబెడుతూ నిరసన చేపట్టారు. వివక్షపూరిత చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగారు మహిళలు.

టెహ్రాన్‌లో పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు చేపట్టిన మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.. ఇరాన్‌ మహిళల హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం