AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా రాజధానిలో భారీ విధ్వంసానికి కుట్ర? నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..!

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తోందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకునే అవకాశాలపై భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా రాజధానిలో భారీ విధ్వంసానికి కుట్ర? నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..!
Us Iran Conflicts
Balaraju Goud
|

Updated on: Nov 17, 2026 | 12:49 PM

Share

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తోందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకునే అవకాశాలపై భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

మీడియా సంస్థల కథనం ప్రకారం.. వాషింగ్టన్‌లోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, లక్ష్యాలకు సంబంధించిన సమాచారాన్ని నిఘా సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా అధికారులు గత వారంలో పలుమార్లు సమావేశమై భద్రతా చర్యలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఇరాన్ తక్షణమే దాడికి సిద్ధమైందని లేదా అలాంటి కుట్రను అమలు చేయాలని నిర్ణయించుకుందని ఈ నిఘా సమాచారం నిర్ధారించడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వైట్ హౌస్ కూడా స్పందించింది. అమెరికా అన్ని రకాల ముప్పులను నిరంతరం పర్యవేక్షిస్తోందని, అయితే ప్రస్తుతం అమెరికా ప్రధాన భూభాగానికి నమ్మదగిన తక్షణ ముప్పు లేదని ప్రతినిధి లారెన్ బిస్ వెల్లడించారు.

ఇరాన్ కమ్యూనికేషన్లపై నిఘా..!

అమెరికా నిఘా సంస్థలు గుర్తించిన కొన్ని కమ్యూనికేషన్లలో దేశంలో బాంబుల తయారీకి అవసరమైన సామగ్రిని నిల్వ చేసి ఉండవచ్చనే సంకేతాలు ఉన్నట్లు సమాచారం. రేడియోధార్మిక పదార్థాలు, రసాయన ఏజెంట్లు ఇప్పటికే అమెరికాలోకి చేరి ఉండవచ్చని కొందరు జాతీయ భద్రతా అధికారులు అనుమానిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సమాచార విశ్వసనీయతపై అమెరికా అధికారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి దాడి చేయడానికి అవసరమైన వ్యక్తులు, కార్యాచరణ సామర్థ్యం ఇరాన్‌కు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా స్పష్టత లేదు.

డర్టీ బాంబ్ అంటే ఏమిటి?

డర్టీ బాంబ్ అనేది సంప్రదాయ పేలుడు పదార్థాలతో పాటు రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించి కాలుష్యాన్ని వ్యాప్తి చేసే పరికరం. ఇది అణుబాంబు కాదు. అణు విస్ఫోటనం జరగదు. అయితే పేలుడు కారణంగా ప్రాణనష్టం సంభవించడంతో పాటు రేడియోధార్మిక కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడానికి భారీ ఖర్చు, ఎక్కువ సమయం అవసరమవుతుంది.

ట్రంప్‌పై గతంలోనూ హత్యాయత్నం కుట్ర!

ఇరాన్‌పై అమెరికా చేస్తున్న ఆరోపణలు కొత్తవేమీ కావు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలం నుంచే అమెరికా అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కుట్రలు పన్నుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 2024లో ట్రంప్‌పై కిరాయి హత్యకు కుట్ర పన్నినట్లు కూడా అమెరికా ఆరోపించింది.

ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక ఆంక్షలు, సైనిక ఒత్తిడి కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య దౌత్య చర్చలు కూడా నిలిచిపోయినట్లు సమాచారం. మరోవైపు అమెరికా నిఘా చట్టం గడువు ముగియడం కూడా భద్రతాపరమైన చర్చలకు దారితీసింది. ఉగ్రవాద ముప్పులను ముందుగానే గుర్తించే నిఘా సామర్థ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ దాడికి సిద్ధమైందనే విషయానికి స్వతంత్ర నిర్ధారణ లేదు. అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలు, వాటి విశ్వసనీయతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us