Siddipet: కారు తొక్కింది.. కోడి చచ్చింది.. పంచాయతీ PSకు చేరింది..
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ కోడిని ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై ప్రశ్నించిన కోడి యజమానితో కారు నడిపిన వ్యక్తి వాగ్వాదానికి దిగడంతో.. బాధితుడు చనిపోయిన కోడిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

కారు స్పీడ్‌కు ఓ కోడి బలైపోయింది.. పోనీలే ప్రమాదవశాత్తు జరిగిందని వదిలేద్దామంటే.. కారు నడిపిన వ్యక్తి ఓవర్ యాక్షన్ చేశాడు! దీంతో కోడి చావుతో మొదలైన గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన 63 ఏళ్ల పౌడాల రాములు ఇంటి దగ్గర కోళ్లను పెంచుకుంటున్నారు. సోమవారం మల్లోజుల రవికుమార్ అనే వ్యక్తి కారులో వేగంగా వెళ్తూ.. రాములు ఇంటి ముందు ఉన్న కోడిని ఢీకొట్టాడు. దీంతో ఆ కోడి అక్కడికక్కడే చనిపోయింది. కళ్ల ముందే కోడి చనిపోవడంతో రాములు బాధపడ్డారు. కారు అంత వేగంగా, నిర్లక్ష్యంగా నడిపితే మనిషి ఎదురొచ్చినా ఇలాగే ఢీకొడతావా? అంటూ డ్రైవర్‌ను ప్రశ్నించారు.
అక్కడే అసలు కథ మొదలైంది! తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాల్సింది పోయి.. రవికుమార్ ఎదురుదాడికి దిగినట్లు రాములు ఆరోపిస్తున్నారు. దుర్భాషలాడటమే కాకుండా.. ‘నువ్వేం చేసుకుంటావో చేసుకో’ అంటూ బెదిరించాడని చెబుతున్నారు. దీంతో రాములు దంపతులు ఊరుకోలేదు. చనిపోయిన కోడిని తీసుకుని ఏకంగా 8 కిలోమీటర్లు ప్రయాణించి చేర్యాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఎస్సై అపూర్వ రెడ్డిని కలిసి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. కోడిని చంపినందుకు ఒక బాధ.. న్యాయం అడిగితే బెదిరించాడనే మరో ఆవేదనతో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
మొత్తానికి ఓ కోడి మృతి.. ఇద్దరి మధ్య గొడవ.. చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు వరకు వెళ్లింది!
