AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్ తుఫాన్.. ఏపీకి ఎంత దూరంలో ఉందంటే?

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడుతోంది. మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం నెల్లూరు, తుని మధ్య తీరం దాటే సూచనలున్నాయి. నవంబర్ 19, 20 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందస్తు చర్యలకు ఆదేశించారు.

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్ తుఫాన్.. ఏపీకి ఎంత దూరంలో ఉందంటే?
Cyclone Akvan Update
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2026 | 11:58 AM

Share

అమరావతి: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అక్వాన్’ (Akvan) తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది.. అక్వాన్ తుఫాను గత 9 గంటలుగా క్రమంగా తీవ్రత పెంచుకుందని.. మంగళవారం సాయంత్రానికల్లా తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. తుఫాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్నందున దీనిపై సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ తుఫాను శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు, తుని మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుఫాను కేంద్రం చెన్నైకి 610 కి.మీ., మచిలీపట్నానికి 660 కి.మీ., విశాఖపట్నానికి 670 కి.మీ., మరియు 790 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని , రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ, ఆర్‌టిజిఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను గమనం, ముందస్తు సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ (RTGS), విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం తుఫాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇవాళ సాయంత్రానికి తుపాను గమనంపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. అక్వాన్ ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.

అర్నాబ్, మురసు తుఫాన్ల తర్వాత.. మూడో తుఫాను అక్వాన్ ఏపీ వైపు వస్తుందని.. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.. ఎంతటి విపత్తు సంభవించినా ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందనే భరోసా కల్పించాలని సీఎం అన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను నేరుగా చేరవేయాలని ఆదేశించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

రియల్ టైమ్‌లో పరిస్థితిని అంచనా వేస్తూ రెస్క్యూ ఆపరేషన్లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తుఫాను ప్రభావంతో చెట్లు కూలినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా యుద్ధప్రాతిపదికన తొలగించి విద్యుత్, రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని ఆదేశించారు.

Follow Us