AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఉదయం టీతో బిస్కెట్లు తింటున్నారా? నెల రోజుల్లోనే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవ్‌

చాలామంది భారతీయుల రోజు ఉదయం ఒక కప్పు వేడి వేడి టీతోనే ప్రారంభమవుతుంది. దానికి తోడు రెండు బిస్కెట్లు తింటే అల్పాహారం పూర్తయినట్లుగా భావిస్తారు. తక్కువ ఖర్చుతో, సులభంగా దొరికే ఈ అలవాటు చాలామంది ఇళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా టీ, బిస్కెట్లు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నెల రోజుల పాటు ఇదే అలవాటును కొనసాగిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను తెలుసుకోవడం అవసరం..

రోజూ ఉదయం టీతో బిస్కెట్లు తింటున్నారా? నెల రోజుల్లోనే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవ్‌
Tea And Biscuits For Breakfast
Srilakshmi C
|

Updated on: Nov 17, 2026 | 12:05 PM

Share

టీ, బిస్కెట్లు తినడం అప్పటికప్పుడు ఆకలిని తగ్గించినా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో మాత్రం వెనుకబడతాయి. ముఖ్యంగా ప్యాకెట్ బిస్కెట్లలో మైదా, చక్కెర, కొవ్వులు అధికంగా ఉంటాయి. తీపి కలిపిన టీ కూడా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులపై ప్రభావం చూపుతుంది. ప్రొటీన్లు, ఫైబర్ తక్కువగా ఉండే ఇలాంటి అల్పాహారం రోజువారీ శక్తి, ఆకలి నియంత్రణ, జీవక్రియపై ప్రభావం చూపవచ్చు. కన్సల్టెంట్ డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం టీతో పాటు మైదాతో తయారైన బిస్కెట్లు, చక్కెర కలిపిన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పెరుగుదలను నియంత్రించేందుకు శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లు తరచుగా కొనసాగితే కొంతమందిలో ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) వచ్చే ప్రమాదం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, బిస్కెట్లలో ఫైబర్, ప్రొటీన్లు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండదు. ఉదయం 10 గంటలకే మళ్లీ ఆకలి వేయడం, అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రీడయాబెటిస్ ఉన్నవారు ఇలాంటి ఆహారపు అలవాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

నెల రోజుల పాటు ఇదే అలవాటు ఉంటే పోషకాల లోపం వస్తుందా?

టీ, బిస్కెట్లను మాత్రమే అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందకుండా పోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

  • ప్రొటీన్ల కొరత: కండరాల నిర్మాణం, మరమ్మతులకు ప్రొటీన్లు ఎంతో అవసరం. అల్పాహారంలో ప్రొటీన్లు లేకపోతే కండరాల ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అలాగే త్వరగా ఆకలి వేయడానికి కూడా ఇది ఒక కారణం కావచ్చు.
  • జీర్ణ సమస్యలు: బిస్కెట్లలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు అవసరమైన పీచు పదార్థాలు అందవు. దీంతో కొంతమందిలో మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.
  • ఐరన్ శోషణపై ప్రభావం: టీలో ఉండే టానిన్లు ఆహారం ద్వారా లభించే ఐరన్ శోషణను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారు భోజనంతో పాటు టీ తాగకుండా జాగ్రత్తపడాలి.
  • అలసట, ఎముకల ఆరోగ్యం: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల బి విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు తగినంతగా అందకపోవచ్చు. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.
  • బరువు పెరిగే ప్రమాదం: చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే టీ, బిస్కెట్లను తరచూ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు శరీరంలో చేరతాయి. ఇవి బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ సమస్యలకు దోహదపడవచ్చు.

టీతో బిస్కెట్లు తినడం పూర్తిగా మానేయాలా?

టీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే దానితో పాటు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
  • చక్కెర లేని టీ: టీని తక్కువ చక్కెరతో లేదా చక్కెర లేకుండా తీసుకోవడం మంచిది. అల్లం, యాలకులు, దాల్చిన చెక్క వంటి సహజ పదార్థాలను కలిపి తాగవచ్చు.
  • బాదం పప్పులు: రాత్రంతా నానబెట్టిన 8 నుంచి 10 బాదం పప్పులు తీసుకోవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి.
  • మఖానా: ఇంట్లో తక్కువ నూనెతో వేయించిన మఖానా మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఫైబర్, ఇతర పోషకాలు లభిస్తాయి.
  • ఉడికించిన గుడ్డు: ప్రొటీన్ల కోసం ఒక ఉడికించిన గుడ్డు తీసుకోవచ్చు.
  • బేసన్ చిల్లా: శనగపిండితో తయారుచేసిన చిల్లా మంచి అల్పాహార ఎంపిక.
  • పండ్లు: త్వరగా బయటకు వెళ్లాల్సి వస్తే జామపండు లేదా అరటిపండు తీసుకోవచ్చు.
  • కూరగాయలు: దోసకాయ, క్యారెట్ ముక్కలను కూడా అల్పాహారంలో చేర్చుకోవచ్చు.

ఉదయం టీతో బిస్కెట్లు తినడం అప్పుడప్పుడు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ ప్రతిరోజూ వాటినే పూర్తి అల్పాహారంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అల్పాహారంలో చేర్చుకోవాలి. ఉదయం టీ తాగే అలవాటును కొనసాగిస్తూనే బిస్కెట్ల స్థానంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. చిన్న చిన్న ఆహారపు మార్పులే దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నోట్‌: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, మధుమేహం లేదా ఐరన్ లోపం వంటి సమస్యలు ఉన్నవారు డైటీషియన్ లేదా వైద్యుల సలహా మేరకు ఆహార మార్పులు చేసుకోవాలి.

Follow Us