AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ కాల్పుల విరమణ బేఖాతరు.. హోర్ముజ్‌లో నౌకపై విరుచుపడ్డ ఇరాన్.. !

ఇరాన్ - అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో, మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. రెండవ విడత చర్చలు రద్దు కావడం ఇరు దేశాల మధ్య అగాధాన్ని పెంచగా, వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధి మరోసారి రక్తసిక్తమైంది. గతంలో అమెరికా రెండుసార్లు దాడులకు పాల్పడగా, ఈసారి ఇరాన్ ప్రతీకార చర్యకు దిగడం సంచలనం సృష్టించింది.

ట్రంప్ కాల్పుల విరమణ బేఖాతరు.. హోర్ముజ్‌లో నౌకపై విరుచుపడ్డ ఇరాన్.. !
Iran Fires At Ship In Hormuz
Balaraju Goud
|

Updated on: Apr 22, 2026 | 11:51 AM

Share

ఇరాన్ – అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో, మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. రెండవ విడత చర్చలు రద్దు కావడం ఇరు దేశాల మధ్య అగాధాన్ని పెంచగా, వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధి మరోసారి రక్తసిక్తమైంది. గతంలో అమెరికా రెండుసార్లు దాడులకు పాల్పడగా, ఈసారి ఇరాన్ ప్రతీకార చర్యకు దిగడం సంచలనం సృష్టించింది. రెండో విడత కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఆందోళన నెలకొంది. దీంతో అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి.

పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలు విఫలం కావడం ఒకవైపు, ఇరాన్ తన పారామిలిటరీ బలగాలతో సముద్ర జలాల్లో దాడులకు దిగడం మరోవైపు ప్రపంచ వాణిజ్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. బ్రిటీష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) కథనం ప్రకారం, బుధవారం (ఏప్రిల్ 22) ఉదయం 7:55 గంటల ప్రాంతంలో వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విరుచుకుపడింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే గార్డ్ గన్‌బోట్లు నౌకపై కాల్పులు జరిపి దానిని దెబ్బతీశాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, సముద్ర పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లలేదని ప్రాథమిక సమాచారం అందింది.

ఒమన్ తీరానికి ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) విరుచుకుపడ్డారు. ఒక గన్‌బోట్‌లో వచ్చిన సైనికులు నౌకను చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మెరుపు దాడిలో నౌక కంట్రోల్ రూమ్ తీవ్రంగా దెబ్బతింది. యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఈ దాడిని ధృవీకరించింది. అదృష్టవశాత్తూ, నౌకలో మంటలు చెలరేగలేదు. పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు కెప్టెన్ ధృవీకరించారు. అయితే, వరుసగా జరుగుతున్న ఈ దాడులు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుతున్నప్పటికీ, ఇరు దేశాల మొండి వైఖరి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.

ఈ దాడిని ధృవీకరించిన ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు ‘ఫార్స్’, ‘తస్నిమ్’, ఇది తమ జలభాగంపై తమకున్న హక్కును నిరూపించుకోవడమేనని పేర్కొన్నాయి. ప్రపంచ ముడి చమురు, సహజ వాయువు వాణిజ్యంలో దాదాపు 20 శాతం వాటా కలిగిన ఈ ఇరుకైన జలసంధిపై తమ నియంత్రణను చట్టబద్ధంగా అమలు చేస్తున్నామని ఇరాన్ గట్టిగా వాదిస్తోంది. శాంతి చర్చలు అటకెక్కిన వేళ, తుపాకుల మోతతో హోర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ యుద్ధ మేఘాల కింద నలుగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us