పుదీనా సాగుతో కాసుల వర్షం.. నాణ్యమైన దిగుబడి కోసం ..
21 April 2026
Jyothi Gadda
పుదీనా ఒక బహువార్షిక మొక్క. ఇది తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే వాణిజ్య పంట. ఈ సాగుకు ఉష్ణమండల, ఉప ఉష్ణమండల వాతావరణం అనుకూలం.
పుదీనాను వేర్ల ద్వారా నాటుకోవడం ఉత్తమం. ఆకుల్లో నూనె శాతం ఎక్కువగా ఉండాలంటే సరైన సమయంలో కోతలు కోయడం, క్రమం తప్పకుండా నీటి తడులు అందించడం ముఖ్యం.
తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటల కోసం చూస్తున్న రైతులకు పుదీనా ఒక చక్కని ఎంపిక. దీని ఆకులు, కాండం, దీని నుండి తీసే నూనెకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
పుదీనాను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. అయితే జనవరి నుండి మార్చి మధ్య కాలం నాటడానికి అత్యంత అనుకూలం. వేర్లను 40 సెం.మీ దూరంలో ఉన్న సాళ్లలో 10 సెం.మీ లోతులో నాటాలి.
నాటిన వెంటనే తేలికపాటి నీటి తడి అందించడం అవసరం. మొక్కలు వేగంగా పెరగడానికి నత్రజని (Nitrogen) కీలక పాత్ర పోషిస్తుంది. నత్రజనిని సమాన వాయిదాల్లో అందించాలి.
అలాగే భాస్వరం, పొటాషీయం ఎరువులు కూడా మోతాదు ప్రకారం వేయాలి. పుదీనాకు ఎక్కువ నీరు అవసరం. వేసవిలో ప్రతి వారం నీటి తడి ఇవ్వాలి. ఆకులు భూమిపై విస్తరిస్తాయి కాబట్టి ప్రారంభ దశలో కలుపు తీయడం చాలా ముఖ్యం.
మొదటి కోత సాధారణంగా నాటిన 100-120 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. రెండో కోత మొదటి కోత నుండి 60-70 రోజుల తర్వాత చేయవచ్చు. పూత దశకు రాకముందే కోయడం వల్ల నూనె దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
పుదీనా సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. రైతులు కేవలం ఆకులను అమ్మడమే కాకుండా, నూనె తీసే యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే మరింత లాభదాయకం.