Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైకిల్‌కో మ్యూజియం, ఎక్కడుందో తెలుసా?

ఇవాళ అంతర్జాతీయ మ్యూజియం డే అట! అంచేత మనం కొన్ని వింతైన మ్యూజియంల గురించి తెలుసుకోవాలి కదా! ఇప్పుడో మనకు మంచి అనుభూతులను పంచే ఓ మ్యూజియం గురించి తెలుసుకుందాం!

సైకిల్‌కో మ్యూజియం, ఎక్కడుందో తెలుసా?
International Museum Day
Follow us
Balu

| Edited By: Phani CH

Updated on: May 18, 2021 | 11:50 AM

ఇవాళ అంతర్జాతీయ మ్యూజియం డే అట! అంచేత మనం కొన్ని వింతైన మ్యూజియంల గురించి తెలుసుకోవాలి కదా! ఇప్పుడో మనకు మంచి అనుభూతులను పంచే ఓ మ్యూజియం గురించి తెలుసుకుందాం! మనకు ఊహ వచ్చిన తర్వాత ఎక్కి తిరిగే వాహనం సైకిలే! అసలు సైకిల్‌తో మనకున్న అనుబంధమే వేరు! ఓ తరం ముందువారికైతే సైకిలే సర్వస్వం.. ఎంతదూరమైనా సైకిల్‌పై హాయిగా వెళ్లొచ్చేవారు! ఇప్పుడీ సైకిల్‌ సంగతులెందుకంటారా..? గత స్మృతులను నెమరేసుకునేందుకు … అప్పట్లో సైకిల్‌ ఎలా ఉండేదో తెలుసుకునేందుకు అమెరికాలో ఓ సైకిల్‌ మ్యూజియంను ఏర్పాటు చేశారు కాబట్టే సైకిల్‌ ముచ్చట్లు.

పాతతరం వారికి బీపీలు.. షుగర్లు ఎక్కువగా అంటకపోవడానికి కారణమేమిటంటే సైకిలే! ఎడ్ల బళ్లను.. గుర్రపు టాంగాలను వదిలేస్తే మొదటిసారిగా రోడ్డెక్కిన ద్విచక్రవాహనం సైకిలే! ముత్తాతల కాలం నుంచి ఇప్పటి వరకు సైకిల్‌కు అదే క్రేజు! దానిపై అదే మోజు! ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, మన పూర్వీకులు ఉపయోగించిన సైకిల్‌ దగ్గర నుంచి ఈ తరం వాడుతున్న సైకిల్‌ వరకు అన్నింటిని ఒక్క దగ్గర చూసే ఓ చోటుందని చెప్పడానికే! మొట్టమొదటగా సైకిల్‌ ఎలా ఉండేది..? సైకిళ్ల పరిణామక్రమంబెట్టిది..? రూపు రేఖలు ఏ విధంగా మారాయి..? ఇత్యాది విషయాలను తెలుసుకోడానికి సైకిల్‌ స్వర్గం చక్కగా ఉపయోగపడుతుంది..

సైకిల్‌ స్వర్గమంటే మరేం లేదు.. సైకిల్‌ మ్యూజియమే! అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ఉందీ మ్యూజియం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సైకిల్‌ ప్రదర్శనశాల ఇదే! పేరు సైకిల్‌ హెవెన్‌! అచ్చ తెలుగులో సైకిల్‌ స్వర్గం. పేరుకు తగ్గట్టుగానే అదో సైకిల్‌ స్వర్గం! మ్యూజియంలోపలికి వెళితే ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపిస్తాయి.. గోడలు.. పైకప్పులు సమస్తం సైకిళ్లే దర్శనమిస్తాయి.. మూడు వేలకు పైగా సైకిళ్లను చాలా పొందికగా పెట్టారిక్కడ! మొదట మనమేదో సైకిల్‌ షాపుకు వచ్చామన్న ఫీలింగ్‌ కలుగుతుంది.. ఆ తర్వాత సైకిళ్ల గొప్పతనమేమిటో అర్థమవుతుంది..? కాలానికి అనుగుణంగా మారిన సైకిళ్ల నిర్మాణంపై అవగాహన వస్తుంది..

పాతకాలపు సైకిళ్లతో పాటు లేటెస్ట్‌గా తయారు చేసిన సైకిళ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పరిమాణంలో వచ్చిన వ్యత్యాసాలను కూడా గమనించవచ్చు.. చూడముచ్చటగొలిపే సైకిళ్లు ఓ పట్టాన మ్యూజియం నుంచి బయటకు రానివ్వవు.. రకరకాల రంగులలో దర్పంగా నిలుచుకున్న సైకిళ్లను చూసి మనసు పారేసుకోకుండా ఉండలేం.. క్రెయిగ్‌ మోరో అనే ఆయన కృషి ఫలితమే ఈ మ్యూజియం! మూడు దశాబ్దాలుగా సైకిళ్లను సేకరిస్తూ వస్తున్నారాయన! అలా సేకరించినవాటితోనే ఏడేళ్ల కిందట ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.. దానికి చక్కగా సైకిల్‌ హెవెన్‌ అని పేరు పెట్టారు.. ఇప్పుడీ మ్యూజియంను చూసేందుకు పర్యాటకులు క్యూలు కడుతున్నారు

మరిన్ని ఇక్కడ చూడండి: SonuSood Foundation: సోనూసూద్ ఫౌండేష‌న్ పేరుతో న‌కిలీ విరాళాల సేక‌ర‌ణ‌.. ఫ్యాన్స్‌ను అల‌ర్ట్ చేసిన సోనూ…

సిడ్నీ నగరంలో గగుర్పాటు కలిగించే మ్యూజియం, శవాలతో ప్రదర్శనశాల