Indonesia China Relation: మాల్దీవుల బాటలో మరో దేశం.. ప్రభుత్వం మారిన వెంటనే చైనాలో తొలి విదేశీ పర్యటన
మాల్దీవుల అడుగుజాడల్లో మరో ముస్లిం దేశం నడుస్తోంది. ప్రభుత్వం మారిన వెంటనే చైనాతో ఒప్పందం చేసుకున్నాడు ఇండోనేషియా కొత్త అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. కొత్త అధ్యక్షుడు చైనాతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జోకో విడోడో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయగా.. కొత్త అధ్యక్షుడు ప్రబోవో మాత్రం చైనాతో వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
చైనా.. ఇండోనేషియా మధ్య సాన్నిహిత్యం మళ్లీ పెరగడం ప్రారంభమైంది, ఇండోనేషియా కొత్త అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో అధికారం చేపట్టిన వెంటనే తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా చైనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఇరు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. అంతకుముందు ఇదే విధంగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటన కోసం చైనా వెళ్ళారు. అయితే చైనా సాయం మాటల వరకే అని .. అంతకు మించి ప్రత్యేక సహాయం లభించదని అర్ధం అవ్వడంతో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూకి జ్ఞానోదయం అయింది.. భారతదేశం ప్రాముఖ్యతను గ్రహించాడు. మళ్ళీ స్నేహ రాగం అందుకున్నాడు మహమ్మద్ ముయిజ్జూ
చైనా.. ఇండోనేషియాల సాన్నిత్యం గురించి మాట్లాడితే.. డ్రాగన్ కంట్రీకి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఇండోనేషియా.. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. నివేదికల ప్రకారం చైనా కూడా ఇండోనేషియాలో సుమారు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా, వ్యూహాత్మక దృక్కోణంలో చూస్తే భారతదేశం, చైనా రెండింటికీ చాలా ముఖ్యమైనది. అందుకే చైనా.. ఇండోనేషియాలో అధికార మార్పు జరిగినప్పటి నుంచి ఇండోనేషియాను తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించింది.
ఇండోనేషియా అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటన
వాస్తవానికి చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్.. ఇండోనేషియాలో అధికార మార్పు జరిగిన వెంటనే ప్రబోవో సుబియాంటోతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు. అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రబోవోను అభినందించిన మొట్ట మొదటి వ్యక్తీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. ఇండోనేషియాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోనున్నామని జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. ఆ తర్వాత అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్నారు.
చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలూ పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇరు దేశాధినేతల సంయుక్త ప్రకటన ప్రకారం.. వచ్చే ఏడాది తొలిసారిగా చైనా, ఇండోనేషియాల మధ్య విదేశాంగ, రక్షణ మంత్రుల సంయుక్త సమావేశం జరగనుంది.
చైనాతో బిలియన్ డాలర్ల ఒప్పందం
తన పర్యటన ముగింపులో అధ్యక్షుడు ప్రబోవో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఇండోనేషియా, చైనా పరస్పర స్నేహాన్ని బలోపేతం చేయడానికి, రెండు దేశాల శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నాడు. బీజింగ్ నుంచి వాషింగ్టన్‌కు బయలుదేరే ముందు సుబియాంటో ఇండోనేషియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ , చైనీస్ కార్పొరేషన్‌ల మధ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, ఆహార భద్రతతో సహా అనేక రంగాలలో రెండు దేశాల మధ్య బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేశారు.
రాష్ట్ర వార్తా సంస్థ అంటారా ప్రకారం ఇండోనేషియా-చైనా బిజినెస్ ఫోరమ్ సమావేశంలో అధ్యక్షుడు సుబియాంటో మాట్లాడుతూ.. ‘ఆసియాలో చైనా బలమైన వ్యాపార వాటా రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారానికి ముఖ్యమైన అంశం. తాను చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను, ప్రధానమంత్రిని కలిశాను.. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అంగీకరించామని వెల్లడించారు.
చైనా తర్వాత అమెరికాలో
ఈ ఆధునిక కాలంలో శాంతి, సౌభాగ్యానికి మార్గం పరస్పరం సహకార మార్గం అని.. వ్యతిరేకించుకోవడం కాదని అని ఆయన అన్నారు. నివేదికల ప్రకారం ఇండోనేషియా కొత్త ప్రెసిడెంట్ అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతలు తమ దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ అంశాలు. ఈ కారణంగా అతని విదేశీ పర్యటనలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న చైనా, అమెరికా వంటి దేశాలను ఎంచుకున్నట్లు చెప్పారు.
ఇండోనేషియా రాజకీయ పరిశోధకుడు డాక్టర్ అహ్మద్ రిజ్కీ మర్ధతిల్లా ఒమర్ చైనా, అమెరికాల మైత్రి విషయంపై మాట్లాడుతూ.. రెండు రంగాల మధ్య సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ప్రబోవో ప్రయత్నిస్తున్నారని.. ఒకవైపు తమ దేశంలో చైనా వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేసే విధంగా.. మరోవైపు రక్షణ ఆధునీకరణ కోసం అమెరికాతో కలిసి పనిచేయాలన్నారు.
బీజింగ్ ట్రిప్ ముగించుకుని ప్రబోవో అమెరికా చేరుకున్నారు. దీని తరువాత అతను APEC , G20 శిఖరాగ్ర సమావేశాల కోసం దక్షిణ అమెరికాకు వెళ్లనున్నారు. అనంతరం అతను బ్రిటన్, మిడిల్ ఈస్ట్‌లలో పర్యటించనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..