కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో పలు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో భారతీయ దంపతులతో పాటు వారి మూడు నెలల మనవడు సహా నలుగురు వ్యక్తులు మరణించారు. తప్పుడు మార్గంలో డ్రైవింగ్ చేస్తున్న మద్యం దుకాణం దోపిడీ నిందితుడిని పోలీసులు వెంబడిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని NH-401లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.
ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) గురువారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. మృతుల్లో ఇద్దరు 60 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ అని .. ఈ దంపతులు భారతదేశం నుంచి వచ్చినట్లు తెలిపారు. బాధితుల పేర్లను ఎస్‌ఐయూ వెల్లడించలేదు.
ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులతో పాటు మూడు నెలల మనవడు కూడా మృతి చెందినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా హైవే 401 సోమవారం కొన్ని గంటలపాటు మూసివేయబడింది. ఈ ప్రమాదంలో దోపిడీ నిందితుడు కూడా మృతి చెందాడు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారితో పాటు 33 ఏళ్ల తండ్రి, 27 ఏళ్ల తల్లి ఒకే వాహనంలో ఉన్నారని ఏజెన్సీ తెలిపింది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..