Attack On Indian Consulate: అమెరికాలోని ఇండియన్ కాన్సలేట్‌ను తగలబెట్టిన ఖలిస్తానీ మద్దతుదారులు.. ఖండించిన భారత్..
అమెరికాలోని భారత కాన్సలేట్‌పై దాడి చేశారు. అనంతరం కార్యాలయంను తగలబెట్టారు. ఈ దారుణ ఘటన శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌పై జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున..

ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని భారత కాన్సలేట్‌పై దాడి చేశారు. అనంతరం కార్యాలయంను తగలబెట్టారు. ఈ దారుణ ఘటన శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌పై జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల సమయంలో జరిగినట్లుగా పేర్కొన్నాయి. కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయంపై దాడి చేసి నిప్పంటించారని తెలిపాయి. భారత రాయబార కార్యాలయాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు లక్ష్యంగా చేసుకోవడం గత ఐదు నెలల్లో ఇది రెండో ఘటన.
ఈ సంఘటనను యునైటెడ్ స్టేట్స్ తీవ్రంగా ఖండించింది. దౌత్య కార్యాలయంలో మంటలు తీవ్ర రూపం దాల్చకముందే శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం అదుపు చేయగలిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అగ్నిప్రమాదం కారణంగా రాయబారం కార్యాలయంలోని ఏ ఉద్యోగి కూడా గాయపడినట్లుగ సమాచారం అందలేదు. ఈ దాడికి సంబంధించిన ఓ వీడియోను ఖలిస్తానీ మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, టీవీ9 ఈ వీడియో ప్రామాణికతను నిర్ధారించడం లేదు.
ఖలిస్తానీ మద్దతుదారులు షేర్ చేసిన ఈ వీడియోలో, కెనడాలో గ్రూప్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపినందుకు నిరసనగా వారు రాయబార కార్యాలయంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. కెనడాలోని సర్రేలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు నిజ్జర్‌ను కాల్చి చంపారు. నిజ్జర్ సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ)తో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై జరిగిన విధ్వంసం, దహన ప్రయత్నాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు. ఇది అమెరికాలోని విదేశీ దౌత్యవేత్తలపై నేరంగా జరిగిన దాడిగా అభివర్ణించారు.