INDIA STAND: ఇమ్రాన్ చెప్పిందే నిజమైంది.. భారత్‌పై ఒత్తిడికి పెద్దన్న ససేమిరా.. దౌత్య విజయమేనా?

రెండు దశాబ్ధాల క్రితం ‌భారత్‌పై అమెరికా ఒత్తిడి పెద్ద ఎత్తున వుండేది. ఆ సంగతి చాలా మందికి తెలుసు. ఈక్రమంలో రష్యా సైనిక చర్యను భారత్ గట్టిగా వ్యతిరేకించకపోవడం వల్ల.. మనదేశంపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం వుందని ప్రచారం జరిగింది. కానీ వాటికి ఏ మాత్రం బెదరని భారత్ ప్రభుత్వం..

INDIA STAND: ఇమ్రాన్ చెప్పిందే నిజమైంది.. భారత్‌పై ఒత్తిడికి పెద్దన్న ససేమిరా.. దౌత్య విజయమేనా?
Russian invasion of Ukraine
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 13, 2022 | 3:40 PM

INDIA STAND ON RUSSIA-UKRAINE CONFLICT HIGHLIGHTED BY AMERICA BRITAIN: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అక్కసుతో చెప్పాడా ? లేక అంతర్జాతీయ అంశాలను లోతుగా పరిశీలించి చెప్పాడా ? తెలియదు గానీ.. ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) యుద్దం నేపథ్యంలో భారత్ స్టాండ్‌ని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. రష్యాకు శాంతి వచనాలు చెబుతున్న ఇండియా పుతిన్‌(Vladimir Putin)పై గట్టిగా ఒత్తిడి తేవడం ద్వారా యుద్ద విరమణకు ప్రయత్నించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా.. ఎవరు ఇండియాపై ఒత్తిడి తేలేకపోతున్నారు. చివరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) భారీ ఎజెండాతో వర్చువల్ విధానంలో ఏప్రిల్ 11వ తేదీన భేటీ అయినా ఇండియా స్టాండ్‌ను క్వశ్చన్ చేయలేదు సరికదా.. విదేశాంగ విధానంలో భారత్‌కు కచ్చితమైన స్వతంత్ర విధానం వుందని కుండబద్దలు కొట్టారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో బైడెన్, మోదీల భేటీకి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. రష్యాపై ఆంక్షలు విధించినందున ఆ దేశానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఏ చర్యను తీసుకోవద్దని ఇండియాకు బైడెన్ గట్టిగా చెబుతారని చాలా దేశాలు భావించాయి. కానీ వీరిద్దరి భేటీ తర్వాత అదేమీ లేదని తేలిపోయింది. అగ్రనేతల వర్చువల్ భేటీ తర్వాత భారత్ తటస్థ వైఖరిపై యుఎస్ చాలా జాగ్రత్తగా స్పందించింది. మోదీ, బైడెన్ సమాలోచనల తర్వాత వైట్ హౌజ్ వద్ద జరిగిన మీడియా మీట్‌లో బైడెన్ మాట్లాడారు. అమెరికా తరపునే భారత్ వుంటుందా అంటూ ప్రశ్నించిన ఓ విలేకరికి బైడెన్ చాలా సూటిగా సమాధానం చెప్పారు. ‘‘ విదేశాంగ విధానంలో భారత్‌పై ఎవరి ఒత్తిడి పని చేయదు.. ఆ దేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు.. చైనాను బూచిగా చూపి రష్యా విషయంలో పునరాలోచన చేయాలని భారత్‌కు చెప్పలేం.. ఒకవేళ రష్యా, చైనా మరింత సన్నిహితమైతే ఏం చేయాలో భారత్ నిర్ణయించుకోగలదు ’’ అంటూ బైడెన్ తేల్చి చెప్పారు. వైట్ హౌజ్ మీడియా ఆఫీసర్లైతే మరో అడుగు ముందుకేసి.. ఇండియన్ ప్రతినిధుల్లాగా మాట్లాడారు. బుచాలో జరిగిన నరమేధాన్ని ఇండియా ఖండించిందని, ఆ నరమేధంపై స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్ చేసిందని వైట్ హౌజ్ అధికార బృందం విలేకరులకు గుర్తు చేసింది. రష్యా యుద్దాన్ని సమర్థించకపోగా.. చర్చల ద్వారా ఉక్రెయిన్‌తో వున్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిందన్నారు. అదేసమయంలో ఉక్రెయిన్‌కు ఇండియా నుంచి మానవీయ కోణంలో సహాయం అందుతోందని వైట్ హౌజ్ మీడియాకు తెలియజేశారు. అమెరికా, భారత్ దేశాల మధ్య సమాలోచనలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఫిబ్రవరి 24వ తేదీన రష్యన్ మిలిటరీ యాక్షన్ మొదలైన వెంటనే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అదేసమయంలో ఆ దేశాల ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున ఆయుధాలను, మిలిటరీకి అవసరమైన యుద్ద వాహనాలను పంపించాయి. ముఖ్యంగా రష్యన్ దళాలకు చాలా ఉపయుక్తంగా వున్న ట్యాంకర్లను పేల్చి వేసేందుకు అవసరమైన జావెలిన్, స్టింగర్ మిస్సైళ్ళను ఉక్రెయిన్‌కు పంపడం పుతిన్ ప్లాన్‌కు గండికొట్టింది. నిజానికి పుతిన్ ప్లాన్ ఏ కి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. కేవలం రెండు, మూడు రోజుల్లో ఉక్రెయిన్ దేశాన్ని గుప్పిట్లోకి తెచ్చుకునేలా ప్లాన్ చేశాడు. అందుకు తగినట్లుగానే సైన్యాన్ని పంపాడు. వారికి కావాల్సిన ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. అయితే.. ఉక్రెయిన్ ప్రతిఘటన ఈ స్థాయిలో వుంటుందని ఊహించలేకపోయాడు పుతిన్. సుశిక్షితులు, దేశం పట్ల అంకితభావం కలిగిన ఉక్రెయిన్ సైనికులు తమకున్న పరిమిత స్థాయి ఆయుధాలతోనే రష్యన్ ట్యాంకర్లను, హెలికాప్టర్లను, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను ఛేదించారు. వాటిని కూల్చేశారు. రష్యన్లు తమ టార్గెట్ చేరుకోలేకుండా దూరం చేశారు. అయితే.. ఇక్కడ నాటో దేశాల పాత్రను ప్రధానంగా చర్చించుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఉక్రెయిన్ యుద్దంలో డైరెక్టుగా రంగంలోకి దిగలేదు. అలా దిగితే అది అణు యుద్దం వైపు, మూడో ప్రపంచ యుద్దం వైపు దారి తీస్తుందని వాటికి తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఉక్రెయిన్‌కు తమ సైనికులను పంపలేదు. కానీ ఆయుధాలను పంపాయి. ముఖ్యంగా జావెలిన్, స్టింగర్ లాంటి ట్యాంకర్ ఛేదక మిస్సైల్స్‌ని అమెరికా ఉక్రెయిన్‌కు తరలించింది. అమెరికా వద్ద మొత్తం పది వేల జావెలిన్ మిస్సైల్స్ వుంటే అందులోంచి ఆరు వేల మిస్సైల్స్‌ని ఉక్రెయిన్‌కు పంపించింది. అందివచ్చిన అవకాశాన్ని ఉక్రెయిన్ సైనికులు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. జావెలిన్, స్టింగర్ మిస్సైల్స్‌తో రష్యన్ సైన్యం పని పట్టారు. రష్యన్ ట్యాంకర్లను మరీ ముఖ్యంగా కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు 65 కిలో మీటర్ల మేర తరలి వచ్చిన రష్యన్ ట్యాంకర్ల కాన్వాయ్‌ని తుత్తునియలు చేశారు. హెలికాప్టర్లను, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను పెద్ద ఎత్తున కూల్చేశారు. ఓవైపు ఉక్రెయిన్ల ఎదురు దాడి.. ఇంకోవైపు రష్యన్ దళాలకు భారీగా నష్టం.. వెరసి తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలపై పట్టు సాధించడం ద్వారా రష్యా యుద్దానికి విరమణ ఇస్తుందని గత వారం రోజులుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ దాఖలాలు కనిపించడం లేదు. కానీ.. రష్యన్ల దాడుల్లో తీవ్రత తగ్గినట్లు మాత్రం కనిపిస్తోంది.

రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సహా కొన్ని దేశాలు విధించిన ఆంక్షలకు పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. రష్యాపై మరింత ఒత్తిడి పెంచాలంటే ఇండియా వంటి కీలక దేశాలు సహకరించాలని అమెరికా భావించింది. అందుకే ఆగమేఘాల మీద బైడెన్, మోదీల వర్చువల్ మీట్‌కు ఏర్పాట్లు జరిగాయి. ఈ భేటీ అమెరికాకు ఏ మేరకు ఉపయోగపడిందో కానీ.. ఇండియాను మాత్రం దౌత్య విధానంలో మరో మెట్టు ఎక్కించింది. ఈ భేటీలో ముడి చమురు దిగుమతిపై వెల్లడవుతున్న ఆందోళనలను తిప్పికొట్టింది భారత్‌. రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయడంపై అమెరికా ఆందోళనలను కొట్టిపారేసింది. అమెరికన్ మినిస్టర్స్ ఆంటోని బ్లింకెన్, లాయిడ్ ఆస్టన్లతో కలిసి ఇండియన్ మినిస్టర్స్ రాజ్ నాథ్ సింగ్, జయశంకర్ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముడిచమురు దిగుమతిపై భారత్ తమ వాదనను బలంగా వినిపించింది. తద్వారా అటు అమెరికా, ఇటు యూరోపియన్ దేశాలు ఇండియన్ విధానాన్ని తప్పు పట్టే అవకాశమే లేకపోయింంది. ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్.. ముడిచమురు దిగుమతిపై అపోహలను తిప్పికొట్టారు. ‘‘ మీకు చమురు దిగుమతికి సంబంధించిన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశం వస్తే.. మీ దృష్టి ఐరోపాపై ఉండాలి. భారత్‌ కూడా ఇంధన అవసరాల రీత్యా కొనుగోలు చేస్తుంది. కానీ, అంకెలను పరిశీలిస్తే.. భారత్‌ నెలరోజుల్లో కొనుగోలు చేసినంత ముడి చమురును యూరోపియన్ దేశాలు ఒక్క పూటలో కొనుగోలు చేస్తున్నాయి… రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణపై మా దేశం చేసిన ప్రకటనలే వైఖరిని వెల్లడిస్తాయి. ఐక్యరాజ్యసమితి, భారత పార్లమెంట్‌ తదితర వేదికలపై మా వైఖరి స్పష్టంగా ఉంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం. సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే మా వైఖరి. ఈ లక్ష్య సాధనకు అవసరమైన సహకారాన్ని అన్ని రకాలుగా అందజేస్తాం ’’ అని జయశంకర్ కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. సరిగ్గా ఇదేసమయంలో వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ కూడా దాదాపు ఇదేతరహా ప్రకటన చేయడం విశేషం. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను మరింత పెంచబోమని భారత్‌ నుంచి ఏమైనా హామీ లభించిందా ? ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రయత్నాలు ఫలించాయా ? అన్న ప్రశ్నకు జెన్‌సాకీ స్పందించారు. ‘‘ ఈవిషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆ దేశస్థులకు వదిలేయండి. వారు ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది కేవలం రెండు శాతం కంటే తక్కువే.. వారు అమెరికా నుంచి 10 శాతం కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు.. ఆంక్షలకేమీ విరుద్ధం కావు. ఇది నిర్మాణాత్మకమైన సంభాషణ కాదు. మేము వేర్వేరు దేశాలకు ఉండే సొంత అవసరాలను పరిగణనలోకి తీసుకొంటాం ’’ అని జెన్‌సాకీ వ్యాఖ్యానించారు. ఈ ఒక్క స్టేట్ ‌మెంట్ చాలు ఇండియన్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీలో ఎవరు జోక్యం చేసుకోజాలరని. ఇదంతా గమనించిన వైట్ హౌజ్ విలేకరులు.. ఇండియాను, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీని తప్పు పట్టేందుకు అమెరికా భయపడుతోందా అని అడగడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే భారత్ పలు చోట్ల మానవ హక్కుల ఉల్లంఘనను ఆంటోని బ్లింకెన్ తప్పుపట్టారు.

నిజానికి రెండు దశాబ్ధాల క్రితం ‌భారత్‌పై అమెరికా ఒత్తిడి పెద్ద ఎత్తున వుండేది. ఆ సంగతి చాలా మందికి తెలుసు. ఫోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యంలో మనదేశంపై విధించిన ఆంక్షల నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈక్రమంలో రష్యా సైనిక చర్యను భారత్ గట్టిగా వ్యతిరేకించకపోవడం వల్ల.. మనదేశంపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం వుందని ప్రచారం జరిగింది. కానీ వాటికి ఏ మాత్రం బెదరని భారత్ ప్రభుత్వం.. వివిధ వేదికల్లో స్వతంత్ర విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సహా పలు వేదికల్లో జరిగిన వోటింగులకు భారత్ దూరంగా వుంటూ వస్తోంది. దీంతో మన దేశం రష్యా అనుకూల విధానాలను అవలంభిస్తోందని కొందరు భావించారు. ఉక్రెయిన్‌లోను ఈ రకమైన కామెంట్లు వినిపించాయి. కానీ.. ఇటు ఉక్రెయిన్‌కు కూడా ఇండియా హ్యుమనెటేరియన్ గ్రౌండ్స్‌ కింద సాయం చేస్తోంది. అదేసమయంలో రష్యాకు ఇండియా పలు సూచనలు చేసింది. ఉక్రెయిన్‌తో చర్చలు జరపడం ద్వారా శాంతి స్థాపన జరగాలని ఇండియా చెబుతోంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన బైడెన్, మోదీ భేటీలోను ఇండియా ఇదే అభిప్రాయాన్ని తెలియజేసింది. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ముఖాముఖీ భేటీ అయితే సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుందని మోదీ.. బైడెన్‌కు చెప్పారు. తాను ఇదివరకే పుతిన్‌తో ఈ మాటలు చెప్పినట్లు కూడా ప్రధాని తెలిపారు. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఒకేరకమైన విధానాన్ని అనుసరిస్తున్న భారత్ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని పంపింది. ఇండియన్ ఫారిన్ పాలసీ.. పూర్తిగా ఇండిపెండెంట్ అని.. ఎవరి జోక్యానికి, ఎవరి ఒత్తిడికి తమ విధానాన్ని మార్చుకోలేమని చాటింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!