దేశంలో కరోనా మహోగ్రరూపం… కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటాం.. అవసరమైన వైద్య సహాయాలు అందిస్తాంః అస్ట్రేలియా
కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నభారతదేశానికి ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.
Australia Support to India: కరోనా మహమ్మారి విజృంభణతో అల్లాడుతున్న భారత్‌కు సాయమందించడానికి పలు దేశాలు ముందుకొస్తున్నాయి. దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చి రోజుకు మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు వేలకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లో ఆక్సిజన్ కొరతపై పలు దేశాలు స్పందిస్తూ ప్రాణవాయువును సరఫరా చేస్తామని ప్రకటించాయి.
ఇదే క్రమంలో తాజాగా భారత్‌కు సహాయం చేయడానికి ఆస్ట్రేలియా కూడా ముందుకొచ్చింది. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నభారతదేశానికి ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ సోమవారం తెలిపారు. భారత్‌కు అత్యవసరంగా ఆదుకునేందుకు సిద్దమని ఇప్పటికే అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, సౌదీ ఆరేబియా దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వారిని అనుసరిస్తూ.. ఉధృతంగా కరోనా కేసులు ఉన్న భారత్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆక్సిజన్‌తో పాటు అవసరమైన అన్ని వైద్య సహాయాలను అందజేస్తామని మంత్రి గ్రెగ్ హంట్ హామీ ఇచ్చారు.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ భారతదేశానికి సహాయం అందించారని, ఆస్ట్రేలియా భారత్‌తో సత్ససంబంధాలు కలిగి ఉందని మంత్రి గ్రెగ్ హంట్ అన్నారు. భారతదేశం కష్టతరమైన కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కొంటున్నందున, ఆస్ట్రేలియా భారతదేశానికి సాయం అందిస్తూ తన స్నేహితాన్ని కొనసాగిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి చెప్పారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రో కూడా భారత్‌కు సహాయం అందించారు. ‘నేను భారత ప్రజలకు సంఘీభావం తెలిపే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. కరోనాతో ఆ దేశం జరుపుతున్న పోరాటంలో ఫ్రాన్స్ మీకు అండగా ఉంటుది. ఈ సంక్షోభం ఎవరినీ వదిలిపెట్టలేదు. మేం భారత్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని మాక్రో ఒక సందేశంలో తెలిపారు.
Read Also… యూపీలో కోవిడ్ మహమ్మారి ఓ సీనియర్ డాక్టర్ ప్రాణాలనే బలిగొంది, 50 ఏళ్లుగా పని చేసిన ఆసుపత్రిలోనే