కుండపోత వానలు కురుస్తున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చి డేంజర్ లెవెల్స్‌లో ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. వాగులు వంకలు పోటెత్తున్నాయి. ఇదీ ఏపీ, తెలంగాణతో పాటు ఇండియాలో పలు రాష్ట్రాల్లో పరిస్థితి. కానీ యూరప్ మాత్రం చండ ప్రచండమైన ఎండలతో నిప్పుల కుంపటిగా ఉంది. వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్‌లో అయితే కని వినీ ఎరుగని విధంగా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులకు పోర్చుగల్, స్పెయిన్‌లు ఉడికిపోతున్నాయి.
స్పెయిన్‌లోని సివెల హాటెస్ట్ స్పాట్‌గా మారింది. వరుసగా పది రోజుల పాటు అక్కడ 41 డిగ్రీలపైనే రికార్డ్ అయిన ఉష్ణోగ్రత మరింత పెరుగుతూ 46 డిగ్రీలకు చేరింది. పోర్చుగల్‌లో అయితే టెంపరేచర్ రికార్డ్ స్థాయిలో 47 డిగ్రీలను టచ్ చేసింది. ఇప్పటి వరకు దేశంలో రికార్డ్ అయిన మాగ్జిమమ్ టెంపరేచర్ 45.2 డిగ్రీలు. అది కూడా 1995 జూలై 24న నమోదైంది.
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది. తీవ్రమైన ఎండలు, కార్చిచ్చు స్పెయిన్, పోర్చుగల్‌ను కరువు కోరల్లోకి నెట్టేస్తున్నాయి. పెద్ద పెద్ద కొలనులు కూడా ఎండిపోయాయి. ఎండలను తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు యూరప్ దేశాల ప్రజలు.
షవర్ల కింద తడస్తూ సేద తీరుతున్నారు. సాయంత్రమైతే నదీ తీరాలకు చేరుతున్నారు. జూలలో జంతువులు కూడా ఎండల వేడికి విలవిల లాడుతున్నాయి. స్పెయిన్‌లోని మాడ్రిడ్ జూలో జంతువులపై నీళ్లు చల్లుతూ చల్లబరుస్తున్నారు. ఈ హాట్ హాట్ వాతావరణం ఎప్పటికి చల్లబడుతుందోనని యూరప్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.