Trump Effect: భారత్‌కు తగిలిన ట్రంప్ సెగ.. 18 వేల మందిని గెంటేసిన అమెరికా..!
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. కెనడా, మెక్సికో, కొలంబియా, బ్రెజిల్ ఇక తాజాగా భారత్ వంతు వచ్చేసింది. వలసదారులతో బయలుదేరిన విమానం మరికొన్ని గంటల్లో భారత్ చేరుకోనుంది. ట్రంప్ ఆదేశాల మేరకు, అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) దేశం నుండి బహిష్కరించాల్సిన 1.5 మిలియన్ల మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసింది.

అమెరికాలో అధికారం చేపట్టిన తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను దేశం నుండి బహిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కెనడా, మెక్సికో, కొలంబియా, బ్రెజిల్ దేశాలకు చెందిన వారిని గెంటేసిన ట్రంప్.. తాజాగా భారత్ వంతు వచ్చేసింది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిప్పి పంపిస్తున్నారు. అమెరికా మిలటరీకి చెందిన సి -17 ప్రత్యేక విమానం బయలుదేరింది. అమెరికన్ అధికారి ఒకరు ఈ సమాచారం ఇచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇమ్మిగ్రేషన్ ఎజెండాను నెరవేర్చడానికి సైన్యం సహాయం తీసుకుంటున్నారు. దీని కింద సైనిక విమానాల సహాయంతో ప్రజలను బహిష్కరించే పని ప్రారంభించారు.
అమెరికాలో భారత్‌కు చెందిన దాదాపు 7లక్షల 25వేలకుపైగా మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉంటున్నట్టు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్‌కు తరలించేందుకు జాబితా రూపొందించింది. ఈ విషయంలో భారత్ కూడా తమ స్పందనను తెలియజేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఎక్కడ ఉన్నా భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపింది. కాగా, మెక్సికో, సాల్వెడార్ తర్వాత అమెరికాలో ఎక్కువగా ఉంటున్నది భారతీయులే అని లెక్కలు చెబుతున్నాయి.
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తిస్తున్న అధికారులు వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. అందులో భాగంగా భారత్‌కు ఓ విమానం బయలుదేరింది. సీ17 విమానంలో వీరిని తరలిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇప్పటివరకు 8వేల మంది వరకు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు ఒక్కో వ్యక్తిపై అమెరికా దాదాపు 4వేల 675 డాలర్లు ఖర్చు చేస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు, అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) దేశం నుండి బహిష్కరించాల్సిన 1.5 మిలియన్ల మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసింది.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా, భారతీయ అక్రమ వలసదారులను భారతదేశానికి తిప్పి పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో జరిగిన చర్చల సందర్భంగా ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అమెరికాలో నివసిస్తున్న అక్రమ భారతీయుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంలోనైనా చట్టవిరుద్ధంగా నివసించడాన్ని భారత్ వ్యతిరేకిస్తుందని అన్నారు. మన పౌరుల్లో ఎవరైనా అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లయితే, వారు భారతీయ పౌరులు అయితే, స్వదేశానికి చట్టబద్ధంగా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..