Vedant Patel: వేదాంత్ పటేల్.. సూపర్-టాలెంటెడ్.. ప్రవాస భారతీయుడిపై వైట్‌హౌస్‌లో ప్రశంసల జల్లు..

|

Apr 08, 2022 | 1:27 PM

Indian American Vedant Patel: ప్రపంచవ్యప్తంగా ప్రవాస భారతీయులు పలు కీలక పదవుల్లో కొలువుదీరి ఎన్నో సేవలందిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో సైతం ప్రవాస భారతీయులు పలు కీలక పదవులను అలంకరించి..

Vedant Patel: వేదాంత్ పటేల్.. సూపర్-టాలెంటెడ్.. ప్రవాస భారతీయుడిపై వైట్‌హౌస్‌లో ప్రశంసల జల్లు..
Vedant Patel
Follow us on

Indian American Vedant Patel: ప్రపంచవ్యప్తంగా ప్రవాస భారతీయులు కీలక పదవుల్లో కొలువుదీరి ఎన్నో సేవలందిస్తున్నారు. అలానే అగ్రరాజ్యం అమెరికాలో సైతం ప్రవాస భారతీయులు పలు కీలక పదవులను చేపట్టి.. ఆ దేశ ప్రగతికి దోహదపడుతున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైతం.. పాలన విభాగంలో భారతీయులకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. వారంతా శ్వేతసౌధంలో అధ్యక్షుడి కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షిస్తూ.. చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో వేదాంత్ పటేల్‌ ఒకరు. ఆయన శ్వేతసౌధం (White House) లో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా వేదాంత్ పటేల్ సేవలపై ప్రెస్ సెక్రటరీ జెన్‌ సాకీ (Jen Psaki ) గురువారం ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనోక అద్భుతమైన రచయితని, నిత్యం బైడెన్‌తోపాటు తమకు సహకరిస్తుంటారంటూ జెన్ సాకీ అభినందించారు. వేదాంత్‌కు.. సులభమైన పని అప్పగించామంటూ తరచూ ఆటపట్టిస్తుంటాం. కానీ అలా కాదు. ఆయన చేసే పని చాలా కష్టమైనది.. ఆయన సూపర్ టాలెంటెడ్‌ వ్యక్తి కావున పని సులభంగా మారుతుంది. ఆయన చాలా బాగా రాస్తారు. అంతే వేగంగా పనిచేస్తారు. ఆయనకు ప్రభుత్వంలో మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను. ప్రతిరోజు అధ్యక్షుడు, తమకు సహకరించే విషయంలో ఆయన వ్యవహరించే తీరు అద్భుతం అంటూ జెన్‌సాకీ ప్రశంసించారు.

వేదాంత్ ఎక్కడివారంటే..?

వేదాంత్‌ పటేల్‌ (32) గుజరాత్‌ కు చెందిన వారు. వేదాంత్ పుట్టిన తర్వాత ఆయన కుటుంబం కాలిఫోర్నియాకు వలస వెళ్లింది. అక్కడే తన విద్యాబ్యాసాన్ని కొనసాగించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (రివర్‌సైడ్) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. శ్వేతసౌధంలో అసిస్టెంట్‌ మీడియా సెక్రటరీగా చేరకముందు వేదాంత్ బైడెన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. 2012లో మాజీ చట్టసభ సభ్యుడు మైక్ హోండా వద్ద.. డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా వృత్తిని ప్రారంభించారు.

కాగా.. అంతకుముందు వేదాంత్ ట్విట్ చేసి.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 1991లో తమ కుటుంబం గుజరాత్‌ నుంచి ఇక్కడకు వచ్చిందన్నారు. అప్పటి నుంచి నా తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, కృషి వల్లే ఈ రోజు నేను శ్వేతసౌధంలో కూర్చొని పనిచేస్తున్నాను.. అంటూ పేర్కొన్నారు.

Also Read:

Pushpa Song: సామీ సామీ సాంగ్‌కు యుఎస్ అమ్మాయిలు డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్

America: పాఠశాలలో కాల్పుల మోత.. 20 మంది విద్యార్థులను కాపాడిన తెలుగు వ్యక్తి..